నాట్లు.. పాట్లు..
జిల్లాలో మండలాలవారీగా
వరి నాట్ల విస్తీర్ణం (హెక్టార్లలో..)
మండలం మొత్తం సాగు వేసిన
విస్తీర్ణం నాట్లు
రాజమహేంద్రవరం రూరల్ 1,265 886
కడియం 2,217 49
రాజానగరం 3,648 664
అనపర్తి 3,766 1,360
బిక్కవోలు 5,988 224
కోరుకొండ 2,341 302
గోకవరం 1,977 85
సీతానగరం 3,440 110
రంగంపేట 1,000 84
చాగల్లు 3,496 251
దేవరపల్లి 3,130 0
గోపాలపురం 2,211 137
కొవ్వూరు 4,709 565
నిడదవోలు 7,276 1,600
పెరవలి 3,464 2
తాళ్ళపూడి 3,605 173
ఉండ్రాజవరం 4,931 24
నల్లజర్ల 2,862 250
● నత్తనడకన రబీ
● వరి సాగు లక్ష్యం 61,326 హెక్టార్లు
● ఇప్పటి వరకూ 15 వేల
హెకార్లలోనే నాట్లు
పెరవలి: రబీ వరి సాగు పనులు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 61,326 హెక్టార్లలో రబీ వరి సాగు జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ, వివిధ కారణాలతో గత నెల 27వ తేదీ నాటికి 6,766 హెక్టార్లలో మాత్రమే వరి నాట్లు పూర్తయ్యాయి. గడచిన ఎనిమిది రోజుల్లో మరో 8 వేల హెక్టార్ల నాట్లు పడి ఉండవచ్చని అంచనా వేసినా.. మొత్తం సుమారు 15 వేల హెక్టార్లు మాత్రమే అవుతుంది. కొన్ని మండలాల్లో కనీసం 10 శాతం నాట్లు కూడా వేయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రబీ పనులు ఈవిధంగా సాగితే ఈ నెలాఖరుకై నా నాట్లు పూర్తవుతాయో లేదో తెలియని పరిస్థితి. అదే కనుక జరిగితే దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు అంటున్నారు.
జిల్లావ్యాప్తంగా 3 వేల హెక్టార్లలో వరి ఆకుమడులు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత నెలలో సైతం ఖరీఫ్ మాసూళ్లు జరగడంతో చాలాచోట్ల రైతులు సకాలంలో ఆకుమడులు వేయలేకపోయారు. ఇప్పుడు ఆకుమడులు వేసి పది పదిహేను రోజులే అవడంతో నాట్లు మరింత జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా నవంబర్ నెలాఖరులో చేలను దుక్కులు దున్ని డిసెంబర్‌లో దమ్ములు చేసి డిసెంబర్ నెలాఖరుకు రబీ వరి నాట్లు పూర్తి చేయడం రైతులకు ఆనవాయితీ, అందుకు విరుద్ధంగా ఈసారి చాలాచోట్ల జనవరిలో సైతం దుక్కులు దున్ని, నాట్లు వేయడానికి పొలాలను సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
జాప్యానికి కారణాలివీ..
రబీ సాగు జాప్యానికి రైతులు అనేక కారణాలు చెబుతున్నారు. ముఖ్యంగా విత్తనాలు, ఎరువులను సమకూర్చామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అవి లభ్యం కావడం లేదని చాలామంది ఆరోపిస్తున్నారు. దీంతో, వీటిని అధిక ధరలకు ప్రైవేటు సంస్థల వద్ద కొనుగోలు చేయాల్సి వస్తోందని అంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా గత ఖరీఫ్‌లో పంట దెబ్బ తినడం, ధాన్యం దిగుబడి తగ్గడం, గిట్టుబాటు ధర రాకపోవడం వంటి కారణాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనికితోడు ఖరీఫ్‌లో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో రబీ పెట్టుబడికి సొమ్ము లేక రైతులు అవస్థలు పడుతున్నారు. కాలువలకు సమయానికి నీరు విడుదల చేస్తే చాలని ప్రభుత్వం అనుకుంటోందని, కానీ, పెట్టుబడి లేకుండా సాగు పనులు ఎలా చేయగలమని ప్రశ్నిస్తున్నారు.
ఉసులుమర్రులో నాట్లకు పొలాన్ని సిద్ధం చేస్తున్న రైతు
మల్లేశ్వరంలో వారం రోజల ఆకుమడి
భయం వేస్తోంది
వరి సాగు చేయాలంటే భయం వేస్తోంది. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. తుపాను సమయంలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేయలేదు. నానా ఇబ్బందులూ పడ్డాం. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు.
– చిట్టీడి వీర వెంకట సత్యనారాయణ, పెరవలి
ఆందోళనతోనే సాగు
ఖరీఫ్ పంట ఆలస్యంతో రబీ సాగులో మరింత జాప్యం జరుగుతోంది. డిసెంబర్ నెలలో ధాన్యం అమ్మకాలు చేశాం. డిసెంబర్ చివరిలో ఆకుమడులు వేశాం. పంట ఎలా ఉంటుందోననే ఆందోళనతోనే రబీ సాగు చేస్తున్నాం.
– లొల్ల నాగేశ్వరరావు, వరి రైతు, కొత్తపల్లి అగ్రహారం
పెట్టుబడి లేక..
నవంబర్ నెలాఖరులో రబీ ఆకుమడులు వేసేవాళ్లం. ఈ ఏడాది పెట్టుబడికి సొమ్ము లేక అప్పులు చేసి ఆలస్యంగా వేస్తున్నాం. పంట సాగుకు పెట్టుబడి ఎలా తేవాలో తెలియడం లేదు.
– వలవల బాలాజీ, వరి రైతు, ముక్కామల
నాట్లు.. పాట్లు..
నాట్లు.. పాట్లు..
నాట్లు.. పాట్లు..
నాట్లు.. పాట్లు..
నాట్లు.. పాట్లు..


