మురిసేలా.. మైమరపించేలా..
యానాం: ప్రకృతి ప్రేమికుల మది మురిసేలా.. అందరినీ మైమరపించేలా యానాం ప్రజా ప్రజా ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 24వ ఫల, పుష్ప ప్రదర్శన ఈ నెల 6, 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. యానాం డాక్టర్ వైఎస్సార్ ఇండోర్ స్టేడియం పక్కనే బాలయోగి క్రీడా మైదానంలో ఏర్పాటు చేసే ఫల, పుష్ప ప్రదర్శన కోసం ప్రభుత్వం రూ.53.60 లక్షలు ఖర్చు చేయనుంది. కడియం, పూణె తదితర ప్రాంతాల నుంచి తెచ్చే వందలాది పుష్పజాతి మొక్కలు, రైతులు పండించిన వివిధ రకాల కూరగాయలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. అదేవిధంగా ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా పూలతో తయారు చేసిన వివిధ ఆకృతులను విద్యుత్ కాంతుల మధ్య ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఔత్సాహికులకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నారు. ఇళ్లు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద పెంచే పూల మొక్కలను న్యాయనిర్ణేతలు పరిశీలించి వారికి బహుమతులు ఇవ్వనున్నారు. అదేవిధంగా మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ ప్రదర్శన ప్రారంభోత్సవానికి పుదుచ్చేరి సీఎం రంగసామిని, ఎల్జీ కె కై లాషనాథన్‌ను, మంత్రులను ఆహ్వానించనున్నట్లు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ఒకవైపు ప్రజా ఉత్సవాల సాంస్కృతిక ప్రదర్శనలు, మరోవైపు ఫల, పుష్ప ప్రదర్శనతో యానాం పట్టణంలో నాలుగు రోజుల పాటు సందడి నెలకొననుంది.
ఫ యానాంలో ఫల, పుష్ప ప్రదర్శనకు ఏర్పాట్లు
ఫ రేపటి నుంచి నాలుగు రోజుల పాటు కనువిందు
మురిసేలా.. మైమరపించేలా..


