‘బంగారు’ భవ్యశ్రీ
రాజమహేంద్రవరం రూరల్: జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో కొంతమూరుకు చెందిన కెల్లా భవ్యశ్రీ బంగారు, రజత పతకాలు సాధించింది. గత నెల 25 నుంచి 30వ తేదీ వరకూ గ్వాలియర్‌లో జరిగిన 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14 సబ్ జూనియర్స్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరఫున ఆమె పాల్గొంది. 500 మీటర్ల రోడ్ రేస్ విభాగంలో బంగారు, 500–డి విభాగంలో రజత పతకాలను సాధించింది. భవ్యశ్రీ స్థానిక బోధి పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమెను, కోచ్‌లు కె.రాము, వి.ఈశ్వర్‌లను, తల్లిదండ్రులు సునీత, వీరబాబులను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, డీఈఓ కె.వాసుదేవరావు, పాఠశాల డైరెక్టర్ ఎస్.ప్రీతి, ఉపాధ్యాయులు అభినందించారు. ఆసియా గేమ్స్‌లో భారతదేశం తరఫున పాల్గొనడమే తన లక్ష్యమని భవ్యశ్రీ ఈ సందర్భంగా పేర్కొంది.
రౌడీషీటర్లు, గంజాయి,
బ్లేడ్ బ్యాచ్‌కు కౌన్సెలింగ్
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లకు సంబంధిత ఎస్‌హెచ్‌ఓల ఆధ్వర్యాన ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించిన ట్లు జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఒక ప్రకటన లో తెలిపారు. అందరూ సత్ప్రవర్తనతో మెలగాలని, ఎటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయినా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. ఎవరూ గంజాయి తాగడం, విక్రయించడం చేయరాదన్నారు.
రత్నగిరిపై రద్దీ
అన్నవరం: సెలవు రోజు కావడంతో రత్నగిరికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు మూడు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను ఆలయ ప్రాకారంలో టేకు రథంపై ఘనంగా ఊరేగించారు.
విశేషాలంకరణలో
తలుపులమ్మ తల్లి
తుని రూరల్: భక్త వరదాయినిగా ఖ్యాతికెక్కిన తలుపులమ్మ అమ్మవారు ఆదివారం విశేష పుష్పాలంకరణలో దర్శనమిచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 5 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, లోవ దేవస్థానం ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.61,005, పూజా టికెట్లకు రూ.44,430, కేశఖండన శాలకు రూ.1,960, వాహన పూజలకు రూ.4,450, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.23,375, విరాళాలు రూ.47,790 కలిపి మొత్తం రూ.1,82,919 ఆదాయం సమకూరిందని వివరించారు.
భజే విఘ్ననాయకా..
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ చేసి వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 30 మంది, శ్రీలక్ష్మీ గణపతి హోమంలో 23 మంది భక్తులు పాల్గొన్నారు. 1672 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ ఒక్కరోజు ఆలయానికి రూ,2,90,586 ఆదాయం సమకూరిందని అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
‘బంగారు’ భవ్యశ్రీ
‘బంగారు’ భవ్యశ్రీ


