సమస్యలు పరిష్కరించకుంటే 19 నుంచి సహాయ నిరాకరణ
● ఏపీ గ్రామ సర్వేయర్ల సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు
● కాకినాడలో రాష్ట్ర కౌన్సిల్ మహాసభ
కాకినాడ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రీ సర్వే ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 19 నుంచి సహాయ నిరాకరణ చేస్తామని ఏపీ గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు బూరాడ హెచ్చరించారు. కాకినాడ కేఎంసీ ఫంక్షన్ హాలులో సంఘం 5వ రాష్ట్ర కౌన్సిల్ మహాసభ ఆదివారం జరిగింది. దీనికి అన్ని జిల్లాల నుంచి సంఘ ప్రతినిధులు, గ్రామ సర్వేయర్లు సుమారు 150 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ, ఇతర సచివాలయ ఉద్యోగుల మాదిరిగానే ప్రమోషన్ చానల్‌లో బేసిక్ పే రూ.30 వేల పైచిలుకు ఉండాలని, నోషనల్ ఇంక్రిమెంట్, టీఏ, డీఏ పెండింగ్ బిల్లులు చెల్లించాలని, రీ సర్వేలో ఉన్న సర్వేయర్లకు సచివాలయ పరిధిలోని ఇతర సర్వేల నుంచి మినహాయింపు ఇవ్వాలని, రీ సర్వేలో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ సబ్ డివిజన్ తదితర పనుల ఒత్తిడి ఉన్నందుకు చాలినంత సమయం ఇవ్వాలని, వీఆర్వోలు, డీటీలు కూడా రీ సర్వేలో పని చేసేలా చర్యలు తీసుకోవాలని, సర్వే, భూమి రికార్డుల శాఖలో కనీస అర్హతను ఐటీఐ నుంచి డిప్లొమాగా మార్చాలని, ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సహాయ నిరాకరణలో భాగంగా కార్యాలయ పని వేళల్లో మాత్రమే విధులకు హాజరవుతామని స్పష్టం చేశారు. అధిక వేళల్లో విధులు నిర్వహించడమనేది వ్యక్తిగత హక్కులను కాలరాయడమేనని అన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోజ్‌కుమార్, నాయుడు తదితరులు పాల్గొన్నారు.


