‘తాతను ఎలా వధించాలో ఆయన్నే అడుగుదాం’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘గ్రీష్మకాలపు మధ్యందిన మార్తాండునిలా చెలరేగిపోతున్న భీష్మ పితామహుడిని ఎలా నిరోధించాలో తెలియని పాండవులు.. కృష్ణుడితో సమావేశమయ్యారు. తాతను ఎలా వధించాలో ఆయననే అడుగుదామన్న ధర్మరాజు సూచనను కృష్ణుడు ఆమోదించాడు’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో చేస్తున్న వ్యాస భారత ప్రవచన పరంపరలో భాగంగా.. అంపశయ్యను చేరిన భీష్ముని ఇతివృత్తాన్ని ఆదివారం ఆయన వివరించారు. ‘‘ఆయుధాలు, కవచాలు వదిలి, కృష్ణుడితో కలసి కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైన తొమ్మిదో రోజు రాత్రి భీష్ముడిని పాండవులు కలిశారు. ‘తాతా! మాకు ఎలా జయం కలుగుతుంది? నిన్ను ఎలా వధించగలం?’ అని ధర్మరాజు అడిగాడు. ముందు సీ్త్రగా జన్మించి, పురుషుడిగా మారిన శిఖండిని ముందు పెట్టుకుని యుద్ధం చేయాలని భీష్ముడు చెబుతాడు. ధర్మరాజు ఇలా అడగటం, భీష్ముడు తన మరణానికి మార్గం చెప్పడం తప్పు కాదా అనే సందేహం కలగవచ్చు. శిఖండితో భీష్ముడు యుద్ధం చేయడన్నది రహస్యం కాదు. భీష్ముని వధ కోసమే శిఖండి జన్మించాడని.. ద్రోణుడిని వధించడానికే తాను జన్మించానని వనపర్వంలో ధర్మరాజుతో దృష్టద్యుమ్నుడు చెబుతాడు. దుర్యోధనుడితో యుద్ధం ప్రారంభానికి ముందే తాను శిఖండితో పోరాడనని భీష్ముడు బహిరంగంగానే చెబుతాడు. అన్నీ తెలిసి కూడా ధర్మరాజు.. భీష్ముడిని వధోపాయం ఎందుకు అడిగాడనే సందేహం రావచ్చు. నిజానికి శిఖండిని ఎదుట నిలుపుకొని భీష్ముడిని వధించడానికి ఆయన అనుమతిని ధర్మరాజు కోరినట్లు మనం భావించాలి. తీవ్రంగా చెలరేగిపోతున్న భీష్మునిలో పదో రోజు పోరులో ఒక రకమైన వైరాగ్యం ఉదయించింది. తండ్రి ఇచ్చిన స్వచ్ఛంద మరణం వరం స్ఫురణకు వచ్చింది. అర్జునుడు ప్రయోగించిన బాణాలు అతడిని తీవ్రంగా నొప్పించాయి. భీష్ముడి శరీరంలో బాణాలు లేని చోటు రెండంగుళాలు కూడా లేదు. అక్కడ ఎవ్వరూ అంపశయ్య ఏర్పాటు చేయలేదు. బాణాల వలన భీష్ముడు నేల మీద వాలలేదు. బాణాలతో ఏర్పడిన శయ్యపై వాలాడు. ఆయన తల నిరాధారంగా వాలుతూంటే, అర్జునుడు అస్త్రాలతో దిండు వంటిది ఏర్పాటు చేశాడు. భీష్మ పితామహుని వధోపాయం విన్న అర్జునుడు శోకనిమగ్నుడయ్యాడు. ‘బాల్యంలో ఆటలాడుకుంటూ దుమ్ము కొట్టుకుపోయిన వస్త్రాలతో ఆయన ఒడిలో ఆడుకున్నాం. ఒకసారి ఆయన్ను నేను నాన్నా అని పిలిచానట. నేను నీకు నాన్నను కాను. మీ నాన్నకు నాన్న వరుస అయిన వాడిని’ అని భీష్ముడు అన్నారని అర్జునుడు గుర్తు చేసుకున్నాడు’’ అని సామవేదం వివరించారు. అనంతరం భీష్మ పర్వాన్ని సామవేదం ముగించారు. తొలుత భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు పోతనామాత్య విరచిత ‘త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప..’ పద్యంతో ప్రవచనానికి శుభారంభం పలికారు.


