హత్య కేసు నిందితుల అరెస్ట్
రాజోలు: ఏడేళ్ల క్రితం హత్య చేసి పారిపోయిన ఇద్దరు నిందితులను మంగళవారం రాజోలు పోలీస్‌లు అరెస్ట్ చేశారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టీవీ నరేష్ కుమార్, ఎస్సై రాజేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పొదలాడ గ్రామంలో కొప్పాడి శ్రీనివాస్ ఇంటి ముందు ఆరబెట్టిన దుప్పటి 2018 ఏప్రిల్ 4న మాయమైంది. దాన్ని అదే గ్రామానికి చెందిన కామాడి వీర రాఘవులు తీశాడని, అతడిని బ్రాందీషాపులో శ్రీనివాస్ నిలదీశాడు. అలాగే రాఘవులును అక్కడే ఉన్న జగతాని పల్లంరాజు, కొప్పాడి శ్రీను (శ్రీనివాస్ స్నేహితులు) గట్టిగా పట్టుకున్నారు. అనంతరం రాఘవులు తలపై బీరు బాటిల్‌తో కొప్పాడి శ్రీనివాస్ బలంగా కొట్టాడు. దీంతో గాయాల పాలైన రాఘవులును ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పటి నుంచి నిందితులైన కొప్పాడి శ్రీనివాస్, జగతాని పల్లంరాజు, కొప్పాడి శ్రీను పరారయ్యారు. హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో గడిపారు. ఈ ముగ్గురిలో జగతాని పల్లం రాజు చనిపోయాడు. ఏడేళ్లుగా పరారీలో ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రాజోలు కోర్టులో హాజరుపర్చారు.


