రొయ్య పిల్లల సీడ్ వివాదంపై సమావేశం
అమలాపురం రూరల్: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా బొబ్బర్లంక మత్స్యకారుల మధ్య ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రొయ్య పిల్లల సీడ్ సేకరణలో సరిహద్దుపరంగా నెలకొన్న వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆ జిల్లాల జాయింట్ కలెక్టర్లు వై.మేఘ స్వరూప్, టి.నిషాంతి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం అమలాపురం కలెక్టరేట్‌లో జలవనరులు, మత్స్య, సర్వే శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీలు మాట్లాడుతూ 20 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదంపై శాఖల వారీగా సమీక్షించాలన్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం మత్స్యకార సహకార సంఘాల ప్రతినిధులు.. లీజు దరఖాస్తు అంశంపై కోర్టును ఆశ్రయించారన్నారు. ధవళేశ్వరం వద్ద 70 గేట్లను ధవళేశ్వరం మత్స్యకారులకు, బొబ్బర్లంక వద్ద 43 గేట్లను బొబ్బర్లంక మత్స్యకారులకు గతంలో లీజుకు ఇవ్వడం జరిగేదన్నారు. కాటన్ బ్యారేజీ వద్ద ఏ ప్రాంతం ఏ జిల్లా పరిధిలో ఉందో సరిహద్దులు కచ్చితంగా నిర్ధారించాలన్నారు.


