సందడి చేసిన చాంపియన్
● 25న ప్రేక్షకుల ముందుకు
వస్తున్నట్టు ప్రకటించిన హీరో రోషన్
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): చారిత్రక ఘటనల ఆధారంగా తెరకెక్కిన చాంపియన్ చిత్ర బృందం ఆదివారం నగరంలో సందడి చేసింది. ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోందని హీరో రోషన్ వెల్లడించారు. చిత్ర ప్రమోషన్లలో భాగం రాజమహేంద్రవరం వచ్చిన రోషన్, హీరోయిన్ అనశ్వర రాజన్ స్థానిక ప్రసాదిత్య మాల్‌లో విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్య్రానంతరం 1948లో బైరాన్ పల్లె అనే గ్రామంలో జలియన్ వాలాబాగ్ లాంటి సంఘటన చోటు చేసుకుందని, ఆ ఘటన ఆధారంగా చాంపియన్ చిత్రాన్ని దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కించారని తెలిపారు. పుట్ బాల్ క్రీడ బ్రాక్ డ్రాప్ లో, యాక్షన్, అద్భుతమైన రొమాంటిక్ లవ్ స్టోరీతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన అన్నారు. మిక్కీ జె మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారన్నారు. కొరియోగ్రాఫర్లు మంచి నృత్యరీతులు సమకూర్చారని తెలిపారు. వైజయంతి వంటి పెద్ద బ్యానర్‌లో ఇంత పెద్ద సినిమా చేయడం తన అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఇప్పటికే పాటలు, ట్రైలర్‌కు మంచి హైప్ వచ్చిందని సినిమా అంతకు మించి ఉంటుందన్నారు. హీరోయిన్ అనశ్వర రాజన్ అద్భుతంగా నటించిందని, ఈ చిత్రం తర్వాత తనకు తెలుగులో మంచి అవకాశాలు వస్తాయన్నారు. కథ ఎంపిక నుంచి అన్ని విషయాలలో తన తండ్రి శ్రీకాంత్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపారు. ట్రైలర్ రిలీజ్‌కు రామ్ చరణ్ రావడం ఆనందంగా ఉందన్నారు. మరో రెండు చిత్రాలు ఒకే అయ్యాయని త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. హీరోయిన్ అనశ్వర రాజన్ మాట్లాడుతూ తెలుగులో తన తొలి చిత్రమే వైజయంతి వంటి ప్రతిష్టాత్మకమైన బ్యానర్లో పనిచేయడం తన అదృష్టం అన్నారు. ఛాంపియన్ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం అభిమానులతో ఫొటోలు దిగారు. హీరో, హీరోయిన్లకు గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూటర్ మేనేజర్ వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు.


