వీసీని కులం పేరుతో దూషిస్తారా?
● 8వ తరగతి పాస్ కాని మీకు ఆ స్థాయి ఉందా?
● వర్సిటీలో రాజకీయ కార్యకలాపాలేంటి?
● ఎమ్మెల్యే బత్తుల దంపతులపై వైఎస్సార్ సీపీ
యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజా ఫైర్
సాక్షి, రాజమహేంద్రవరం: ‘కనీసం ఎనిమిదో తరగతి కూడా పాస్ కాని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఆయన భార్య అత్యున్నత విద్యావంతులైన నన్నయ వర్సిటీ వీసీ కులాన్ని కించపరుస్తూ మాట్లాడటం దారుణం. ప్రతిష్టాత్మకమైన వర్సిటీలో అనుచితంగా వ్యవహరించడం సమంజసం కాదు.’ అని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హితవు పలికారు. రాజమహేంద్రవరం ప్రకాష్‌నగర్ కార్తికేయ అపార్ట్‌మెంట్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్సిటీలో రాజకీయ నాయకుల బ్యానర్లు, ఫ్లెక్సీలు, రంగులు ప్రదర్శించకూడదనే కనీస ఇంగిత జ్ఞానం ప్రజా ప్రతినిధులకు లేకుండా పోతోందని దుయ్యబట్టారు. అర్ధరాత్రి యూనివర్సిటీలోకి చొరబడి నాయకుల ఫ్లెక్సీలు, గ్లాస్, సైకిల్ గుర్తులు ఉన్న బ్యానర్లు కట్టడం ఏంటని ప్రశ్నించారు. అలా కట్టడం తప్పని చెప్పిన పాపానికి ఎమ్మెల్యే, ఆయన సతీమణి వర్సిటీ వీసీపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్నారు. వీసీని వివిధ రకాలుగా దూషించారన్నారు. ఎమ్మెల్యే సతీమణి చర్యలను అడ్డుకున్న వీసీ అటెండర్ చరణ్‌పై దారుణంగా దాడి చేశారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మంత్రి జక్కంపూడి రామ్మోహనరావుల సంకల్పంతోనే విశ్వవిద్యాలయం ఏర్పాటైందని గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వ పునాదిరాళ్లు, శిలాఫలకాల ఆనవాళ్లను కనిపించనీయకుండా అధికార పార్టీ వ్యక్తులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తాము ఎలాంటి ఆందోళన చేయకుండా వినతి పత్రం ఇచ్చామన్నారు. ఏ హోదాలో ఎమ్మెల్యే సతీమణి బత్తుల వెంకటలక్ష్మి వర్సిటీకి వెళ్లి వీసీని ప్రశ్నించారో స్పష్టం చేయాలన్నారు. ఎమ్మెల్యే ప్రచార పిచ్చితోనే గొడవ జరిగిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో విద్యారంగం భ్రష్టు పట్టిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వీసీలను భయపెట్టి, ఒత్తిడి చేయించి మరీ రాజీనామాలు చేస్తున్నారని ఆరోపించారు.
వైఎస్సార్ సీపీ హయాంలోనే అభివృద్ధి
విశ్వవిద్యాలయంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమం వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జరిగినదేనిని పేర్కొన్నారు. కూటమి పాలన వచ్చి రెండేళ్లవుతున్నా.. ఇప్పటి వరకూ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని విమర్శించారు. విద్యారంగాన్ని బలోపేతం చేయాలని మాత్రమే ఆలోచించామని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, ఘోరాలు దారుణాలు చూస్తున్నామని, నాయకుడు ఏ రకంగా ముందుకు వెళ్తాడో అదే మార్గాన్ని వారి అనుచరులు కూడా అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు నన్నయ యూనివర్సిటీలో జరిగిన గొడవ చూస్తే అర్థమవుతుందని వెల్లడించారు.


