
తల్లి ఆస్తి కాజేసిన కుమారుడికి గుణపాఠం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): సాక్షి సంతకం పేరుతో తల్లి ఆస్తి రాయించుకున్న కుమారుడికి అధికారులు గుణపాఠం చెప్పారు. ఆ గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసి తిరిగి తల్లి పేరు మీద రాయించి ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. గోకవరం మండలం అచ్చయ్యపేట గ్రామానికి చెందిన 72 ఏళ్ల రొబ్బి వెంకట సత్యవతికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆమెకు ఆ గ్రామంలో నాలుగు వాటాల పెంకుటిల్లు వారసత్వంగా వచ్చింది. ఆమె మూడో కుమారుడు లక్ష్మీ మధుసూదనరావు ఆ ఆస్తిని కాజేయాలని పథకం వేశాడు. తల్లికి మాయమాటలు చెప్పి సాక్షి సంతకం పెట్టాలని నమ్మించి తన పేరు మీద 2017లో గిప్ట్‌డీడ్ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న సత్యవతి.. ఆర్డీఓ కృష్ణనాయక్‌ను ఆశ్రయించింది. దీంతో సీనియర్ సిటిజన్స్ యాక్ట్ – 2007 ప్రకారం విచారణ జరిపి, ఆ గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేస్తూ ఆర్టీవో ఉత్తర్వులు జారీ చేశారు. వాటిపై మధుసూదనరావు చేసుకున్న అప్పీల్‌ను కలెక్టర్ తిరస్కరించి, ఆర్డీఓ ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించారు. దీంతో కోరుకొండ రిజిస్ట్రార్ ఆ గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసి, ఆస్తిని మళ్లీ సత్యవతి పేరున రిజిస్టర్ చేశారు. ఆ డాక్యుమెంట్లను శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సత్యవతికి ఆర్డీఓ కృష్ణనాయక్ అందజేశారు.