అత్యుత్సాహం.. కారాదు విషాదం | - | Sakshi
Sakshi News home page

అత్యుత్సాహం.. కారాదు విషాదం

Sep 1 2025 3:17 AM | Updated on Sep 1 2025 3:17 AM

అత్యు

అత్యుత్సాహం.. కారాదు విషాదం

వినాయక ఊరేగింపులు,

నిమజ్జనంలో జాగ్రత్తలు తప్పనిసరి

నిబంధనలు పాటిస్తే అంతా సవ్యమే

రాయవరం/ అమలాపురం టౌన్‌: జై వినాయకా... బొజ్జ వినాయకా.. అంటూ స్వామివారిని కొలుస్తూ నిర్వహించే వేడుకల్లో మానవ తప్పిదాలతో అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి.. గణపతి నవరా త్ర ఉత్సవాలు ముగుస్తుండడంతో నిర్వహించే నిమజ్జనోత్సవాల్లో యువత అత్యుత్సాహం మాటున ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఈ సమయంలో గోదావరి పాయలు, సముద్ర తీరాలు, పంట కాలువలు, చెరువుల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకుంటే అంతా సవ్యమే. లేకుంటే ప్రమాదమే. సాధారణంగా వినాయక నిమజ్జనోత్సవాలు విగ్రహాల ప్రతిష్ఠ అనంతరం 3, 5, 7, 9, 11వ రోజుల్లో చేస్తుంటారు. గత నెల 27న వినాయక ప్రతిష్ఠ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వినాయక విగ్రహ నిమజ్జనాలు ప్రారంభమైనందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

కోనసీమ జిల్లాలో వాడవాడలా వినాయక మండపాలు ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా పోలీసు శాఖకు దరఖాస్తు చేసుకున్న 1,511 వినాయక మండపాలే కాకుండా చిన్నా చితికా మరో 500 మండపాలు పెట్టారు. వీటి నిర్వహణ కమిటీలు నవరాత్రులు ముగిశాక వినాయక విగ్రహాలను ఊరేగింపులతో నిమజ్జనాలు చేస్తాయి. ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ సూచిస్తుంది. కాలువలు, నదులు, చెరువుల్లో విగ్రహాల నిమజ్జనాల సమయంలో ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తాయి. ఈతరాని వారు నీటిలో దిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఇప్పటికే అనేకం జరిగాయి. ఈ ఘటన నేపథ్యంలో జాగ్రత్తలు అవశ్యమని పోలీసు శాఖ చెబుతోంది.

గతంలో ఎన్నో దుర్ఘటనలు

గతేడాది వినాయక నిమజ్జనం సందర్భంగా కిర్లంపూడి మండలం వీరవరం గ్రామానికి చెందిన ఎన్‌.లక్ష్మణబాబు ఏలేరు కాలువలో దిగి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. అంతకు ముందు ఏడాది ఆలమూరు మండలం మడికిలో ఎ.రాజేష్‌ కాలువలో గల్లంతయ్యాడు. అదే ఏడాది బిక్కవోలు మండలం తొస్సిపూడిలో టీఎన్‌వీవీ రామారెడ్డి కాలువలో పడి మృత్యువాత పడ్డాడు. నిమజ్జన ఊరేగింపు అనంతరం తిరిగి వస్తున్న కాకినాడ రూరల్‌ మండలం తూరంగి గ్రామానికి చెందిన కె.లోవరాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇలా అనేక ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా ముఖ్యంగా నిమజ్జనం చేసే కాలువలు, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

ఉత్సవ కమిటీలకు అవగాహన

వినాయక విగ్రహ నిమజ్జనోత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోనసీమ ఎస్పీ బి.కృష్ణారావు జిల్లా పోలీసు అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో మూడు పోలీస్‌ సబ్‌ డివిజన్ల డీఎస్పీలు టీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ (అమలాపురం), సుంకర మురళీమోహన్‌ (కొత్తపేట), రఘువీర్‌ (రామచంద్రపురం)లు తమ తమ డివిజన్లలో వినాయక చవితి ఉత్సవాల కమిటీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే సీఐలు, ఎస్సైలు తమ ప్రాంతాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసిన కమిటీల వద్దకు వెళ్లి నిమజ్జన నిబంధనలు చెబుతున్నారు. ఆయా కమిటీలు నిమజ్జనాలు చేసే నదీపాయలు, సముద్ర తీరాలు, పంట కాలువలు, చెరువులను పరిశీలిస్తున్నారు. నిబంధనలు పాటించండి, అందరూ క్షేమంగా ఉండండి.. అంటూ పోలీసులు హితబోధ చేస్తున్నారు.

ఇలా చేస్తే మంచిది

నిమజ్జనోత్సవ ఊరేగింపుల్లో చిన్న పిల్లలు, మహిళలు పాల్గొన్నా, వారు నీటిలోకి దిగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

మద్యం తాగిన వారు ఉత్సవాల్లో పాల్గొనకుండా కమిటీలు బాధ్యత వహించాలి.

పెద్ద విగ్రహాల ఊరేగింపుల్లో రోడ్డు వెంబడి విద్యుత్‌ తీగలకు తగలకుండా జాగ్రత్తలు పాటించాలి. విద్యుత్‌ తీగలను తప్పించుకుంటూ వెళ్లాలి. లేదా విద్యుత్‌ కార్యాలయాలకు ముందస్తు సమాచారం ఇవ్వాలి.

నిమజ్జనాలు చేసే నదీ పాయలు, సముద్ర తీరాలు, పంట కాలువల వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుకోవాలి.

విగ్రహ నిమజ్జన సమయంలో నీటిలోకి దిగేవారిని ముందే ఎంపిక చేసుకుని వారిని మాత్రమే నదీ పాయలు, సముద్రం, పంట కాలువలు, చెరువుల్లోకి దింపాలి. విగ్రహాన్ని వారే నెమ్మదిగా నీటిలోకి జార విడిచాలి.

ఊరేగింపులు, నిమజ్జనం చేసే ప్రాంతాల్లో బాణసంచా కాల్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

డీజేలతో పెద్ద శబ్దాలకు చెక్‌ పెట్టాలి. ముఖ్యంగా నిమజ్జన ప్రాంతంలో అధిక శబ్ధం వల్ల ఒకరి మాట ఒకరికి వినిపించకపోవడంతో అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది.

కమిటీలదే బాధ్యత

గణేశ్‌ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులకు అవగాహన కల్పించాం. పోలీసులకు ముందస్తు సమాచారం ఇస్తే అందుకు తగిన చర్యలను తీసుకోవడానికి వీలుంటుంది. నిమజ్జనోత్సవాల్లో ప్రాణాపాయం లేకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉత్సవ కమిటీలపై ఉంది.

– బి.రఘువీర్‌, డీఎస్పీ, రామచంద్రపురం

అత్యుత్సాహం.. కారాదు విషాదం1
1/2

అత్యుత్సాహం.. కారాదు విషాదం

అత్యుత్సాహం.. కారాదు విషాదం2
2/2

అత్యుత్సాహం.. కారాదు విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement