రత్నగిరిపై తీరనున్న భక్తుల కష్టాలు | - | Sakshi
Sakshi News home page

రత్నగిరిపై తీరనున్న భక్తుల కష్టాలు

Sep 3 2025 4:29 AM | Updated on Sep 3 2025 4:29 AM

రత్నగిరిపై తీరనున్న భక్తుల కష్టాలు

రత్నగిరిపై తీరనున్న భక్తుల కష్టాలు

పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి నేడు శ్రీకారం

రూ.2.5 కోట్లతో నిర్మించనున్న

ఫార్మా సంస్థ

అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలోని పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి మూడేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. ఈ మార్గంలో సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగనున్నాయి. విశాఖపట్నానికి చెందిన లారెస్‌ ఫార్మాస్యూటికల్‌ సంస్థ రూ.2.5 కోట్ల వ్యయంతో విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి బుధవారం ఉదయం శ్రీకారం చుట్టనుంది. పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు లేకపోవడంతో భక్తుల ఇబ్బందులను గమనించిన అప్పటి ఈఓ చంద్రశేఖర అజాద్‌ 2023లో ఈ ప్రణాళిక రూపొందించారు. పశ్చిమ రాజగోపురం ఎదురుగా సత్యదేవ అతిథిగృహాన్ని కూల్చి, దాని స్థానంలో విశ్రాంతి షెడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించగా, ఇందుకు లారెస్‌ ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ ముందుకొచ్చింది. దీంతో 2023 అక్టోబర్‌లో ఇక్కడ సత్రాన్ని కూల్చేశారు. అదే ఏడాది విజయదశమి నాడు భూమిపూజ జరిగింది. తర్వాత ఈఓ చంద్రశేఖర అజాద్‌ ఇక్కడి నుంచి బదిలీ కావడంతో ఈ ప్రతిపాదన మూలనపడింది. ఇక్కడ విశ్రాంతి షెడ్డు లేకపోవడం వల్ల భక్తులు పడుతున్న ఇబ్బందులపై సాక్షిలో పలు కథనాలు వెలువడ్డాయి. స్పందించిన దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ వీర్ల సుబ్బారావు లారెస్‌ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. పశ్చిమ రాజగోపురం ముందు ఖాళీ ప్రదేశంలో 120 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పున విశ్రాంతి షెడ్డు నిర్మించేందుకు దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ ఆదేశాలు జారీ చేసినట్టు దేవస్థానం ఈఈ రామకృష్ణ మంగళవారం తెలిపారు. ఈ విశ్రాంతి షెడ్డులో 12 కౌంటర్లు, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ లైన్లు, మూడు హెలికాప్టర్‌ ఫ్యాన్లు, నలుగురు కూర్చునేలా 50 సెట్ల స్టీల్‌ కుర్చీలు ఏర్పాటు చేయనున్నారు. షెడ్డు దిగువన మార్బుల్‌ ఫ్లోరింగ్‌ చేయనున్నారు. ఈ ఖర్చంతా లారెస్‌ సంస్థ భరించనుందని ఈఈ తెలిపారు.

రెండు నెలల్లో పూర్తి

● విశ్రాంతి షెడ్డు నిర్మాణాన్ని రెండు నెలల్లో పూర్తి చేయాలని లారెస్‌ సంస్థను కోరినట్టు ఈవో వీర్ల సుబ్బారావు తెలిపారు.

● అక్టోబర్‌ 22 నుంచి కార్తిక మాసం ప్రారంభమవుతున్నందున అప్పటికి అందుబాటులో ఉండేలా చూడాలని కోరామన్నారు. ఇది పూర్తయితే పశ్చిమ రాజగోపురం వైపు వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగుతాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement