
శాంతించిన వరద గోదావరి
● ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద
హెచ్చరిక ఉపసంహరణ
● 9.44 లక్షల క్యూసెక్కుల
మిగులు జలాల విడుదల
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద వరద గోదావరి శాంతించింది. ఉదయం 6గంటలకు 12.70 అడుగులు ఉన్న నీటి మట్టం క్రమేపీ తగ్గుతూ మధ్యాహ్నం 3.47గంటలకు 11.70అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అనంతరం మరింత తగ్గుతూ రాత్రి 7గంటలకు 11.50 అడుగులకు చేరింది. కాటన్ బ్యారేజీ నుంచి 9,44,409 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో నీటి మట్టం స్వల్పంగా పెరుగుతుండగా మిగిలిన ప్రాంతాలలో స్వల్పంగా తగ్గుతున్నాయి. బుధవారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం మరింత తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. డెల్టా కాలువలకు సంబంధించి 12,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 4,900, మధ్య డెల్టాకు 2,300, పశ్చిమ డెల్టాకు 5,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 10.22 మీటర్లు, పేరూరులో 14.82 మీటర్లు, దుమ్ముగూడెంలో 15.15 మీటర్లు, భద్రాచలంలో 41.20 అడుగులు, కూనవరంలో 18.08 మీటర్లు, కుంటలో 10.45 మీటర్లు, పోలవరంలో 11.89 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.85 మీటర్ల వద్ద నీటిమట్టాలు కొనసాగుతున్నాయి.