
ఉగ్ర గోదారి
రాజమహేంద్రవరం రోడ్ కం రైలు బ్రిడ్జి వద్ద గోదావరి ప్రవాహం
11.35 లక్షల క్యూసెక్కుల మిగులు జలాల విడుదల
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం ఉదయం నుంచి క్రమేపీ పెరుగుతూ.. రాత్రి ఏడు గంటలకు 12.80 అడుగులకు నీటి మట్టం చేరింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎప్పటికప్పుడు దిగువకు విడిచిపెడుతున్నారు. కాటన్ బ్యారేజీలోని మొత్తం 175 గేట్లను ఎత్తి, 11,35,249 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి భద్రాచలంలో నీటి ఉధృతి నిలకడగా కొనసాగుతుంది. సోమవారం ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉండటంతో ఇరిగేషన్ అధికారులు ధవళేశ్వరం ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డెల్టా కాలువలకు 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 4,700, మధ్య డెల్టాకు 2,300, పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కులను వదిలారు.
ఎగువ ప్రాంతాల్లో ఇలా..
కాగా ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 12.03 మీటర్లు, పేరూరులో 16.44 మీటర్లు, దుమ్ముగూడెంలో 12.95 మీటర్లు, భద్రాచలంలో 48.10 అడుగులు, కూనవరంలో 19.64 మీటర్లు, కుంటలో 10.84 మీటర్లు, పోలవరంలో 12.64 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద 16.34 మీటర్లు వద్ద నీటిమట్టాలు కొనసాగుతున్నాయి.

ఉగ్ర గోదారి