
3 నుంచి గురుకులం రజతోత్సవాలు
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం శివారు కొంతమూరు గ్రామంలోని శ్రీదత్తాత్రేయ వేదవిద్య గురుకులం రజతోత్సవాలు ఈ నెల మూడో తేదీ నుంచి మూడు రోజుల పాటు గురుకుల ప్రాంగణంలో జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు వేదపరిరక్షణ–సర్వజగద్రక్షణం అనే అంశంపై సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ప్రవచనాలను అందిస్తారు. ఆయా కార్యక్రమాల్లో వేద శాస్త్రాభిమానులు పాల్గొనాలని గురుకులం ప్రతినిధి దత్తాత్రేయ శర్మ ఘనపాఠి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
ఏలేరులో పెరిగిన నీటి నిల్వలు
ఏలేశ్వరం: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఏలేరులో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. ఆదివారం ప్రాజెక్టులోకి 1.708 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి 1.050 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 86.46 మీటర్లకు 80.74 మీటర్లు, 24.11 టీఎంసీలకు 14.26 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో ఆయకట్టుకు 1500, విశాఖకు 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. తిమ్మరాజుచెరువుకు నీటి విడుదల నిలిపివేశారు.
అన్నదానం, గో సంరక్షణకు
రూ.2.5 లక్షల విరాళం
అన్నవరం: సత్యదేవుని వ్రత విభాగంలో పనిచేస్తున్న కర్రి సూర్యనారాయణ (నాని) తన కుమారుడు సత్యగౌరీ ఉదయ్ శర్మకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా సత్యదేవుని నిత్యాన్నదాన పధకానికి రూ.లక్ష, గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.50 లక్షల విరాళాన్ని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్‌కు ఆదివారం అందజేశారు. ఏటా ఆషాఢ బహుళ ఏకాదశి నాడు, అన్నదానం, గోపూజ చేయాలని కోరారు.
7న అంతర్వేది ఆలయం మూసివేత
సఖినేటిపల్లి: సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం నుంచి మూసివేయనున్నట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. భాద్రపద పూర్ణిమ సందర్భంగా ఆ రోజు రాత్రి 9.50 గంటల నుంచి అర్ధరాత్రి 12.24 గంటల వరకూ చంద్రగ్రహణం ఉంటుందన్నారు. దీనితో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆలయాన్ని మూసివేస్తామని, మర్నాడు 8న ఉదయం 8 గంటల నుంచి యథావిధిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. 8వ తేదీ వేకువజామున నిర్వహించాల్సిన ఆర్జిత అభిషేకం రద్దు చేసినట్టు వెల్లడించారు.
స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఎస్సీ
విభాగంలో శ్రీలక్ష్మి ప్రథమం
రామచంద్రపురం రూరల్: ఉండూరు గ్రామానికి చెందిన వరసాల శ్రీలక్ష్మి డీఎస్సీ 2025లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు సబ్జెక్టులో 78.45 మార్కులు సాధించి, తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ గ్రూపు–3లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచారు. దీంతో ఆమె స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయురాలిగా నియామకం పొందనున్నారు. ఆమె భర్త కొల్లి రమేష్ 2012 డీఎస్సీలో ఎస్సీ విభాగంలో జిల్లా ప్రథమ స్థానం సాధించడం విశేషం. అదే రీతిలో ఇప్పుడు భార్య కూడా సాధించడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. హసన్‌బాద జెడ్పీ హైస్కూల్‌లో శ్రీలక్ష్మి పదో తరగతి వరకూ చదువుకున్నారు. రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ, విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చదివారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా రమేష్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రణాళికా బద్ధంగా చదివితే పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చని తెలిపారు.

3 నుంచి గురుకులం రజతోత్సవాలు