
జల దిగ్బంధం
తుడిచిపెట్టుకు పోయాయి
పంటలు బాగా పండి, మంచి గిట్టుబాటు ధర ఉన్న సమయంలో వరదలు వచ్చి పంటలు తుడిచి పెట్టుకుపోయాయి. ఎకరం అరటి తోట వేశాను. కలసి వస్తుందనుకున్న తరుణంలో వరద వల్ల మొత్తం పంట పోయింది, రూ.లక్ష అప్పు మిగిలింది. ఏం చేయాలో తెలియడం లేదు.
– మెట్టె నాగరాజు, అరటి రైతు, ఖండవల్లి
నష్టమే మిగిలింది
ఈ ఏడాది గోదావరికి రెండు సార్లు వరద వచ్చింది. మొదటిసారి ముంపుతో ఎకరం పూల తోట పూర్తిగా పాడైపోయింది. ఎకరం అరటి తోట మిగులుతుందని అనుకున్నాను. రెండోసారి వచ్చిన వరదతో అరటితోటా పోయింది. ఈ ఏడాది అంతా నష్టమే మిగిలింది.
– వేండ్ర నర్శింహారావు, పూల రైతు, కాకరపర్రు
ఇదేనా రైతులపై ప్రేమ?
గతంలో గోదావరికి వరద వస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులకు నష్ట పరిహారం ఇచ్చారు, ఇప్పుడు వరదల కారణంగా పంటలు నష్టపోయినా పంటనష్టం అంచనాలు వేయడానికి కూడా అధికారులు రాలేదు, ఇదేనా రైతులపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమ?
– కుసుమే సూరిబాబు, లంక రైతు, లంకమాలపల్లి
ఖండవల్లిలో ముంపునకు గురైన కంద పంట
ముక్కామలలో నీట మునిగి పాడైన బెండ తోట
ముత్యాలవారిపాలెంలో కుళ్లిన దొండ పందిరి
● గోదావరి కన్నెర్రకు లంక రైతుల విలవిల
● కర్షకుల నడ్డి విరుస్తున్న వరదలు, వర్షాలు
● జిల్లాలో 500 హెక్టార్లలో ఉద్యాన, 1,500 హెక్టార్లలో వరి, ఇతర పంటలకు నష్టం
● కుదేలైన 5,500 మంది రైతులు
● ఉపాధి కోల్పోయిన 30 వేల మంది కూలీలు
● పంట నష్టాన్ని పట్టించుకోని కూటమి సర్కార్
● గత ప్రభుత్వంలో లంక రైతులకు రూ.24 కోట్ల పరిహారం
పెరవలి: లంక రైతులపై గోదావరి కన్నెర్ర చేస్తోంది. అల్ప పీడనాలు, వాయుగుండాలు, కుంభవృష్టితో ఉప్పొంగిన వాగులు, వంకలు, ఉగ్రరూపం దాల్చిన గోదావరి వెరసి.. ఈ ఏడాది జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో రైతులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో అన్ని పంటలకూ ప్రకృతి శాపం తగిలిందా అన్నట్టుగా.. మెట్ట, పల్లం అనే తేడా లేకుండా మొత్తం పాడైపోయాయి. ఎటుచూసినా ఎండిన కంపలతో, కుళ్లిన నారుతో చేలు దర్శనమిస్తున్నాయి.
భారీగా పంట నష్టం
జిల్లాలో తాళ్లపూడి నుంచి పెరవలి మండలం వరకూ, అటువైపు సీతానగరం నుంచి కడియం వరకూ అరటి, కంద, పసుపు, కోకో, వరి, మొక్కజొన్న, జామ, బొప్పాయి, కూరగాయల పంటలు, పూల తోటలు.. ఇలా అన్నీ ప్రకృతి కన్నెర్రతో నాశనమయ్యాయి. జిల్లాలో దాదాపు 500 హెక్టార్లలో వాణిజ్య పంటలు, సుమారు 1,500 హెక్టార్లలో వరి, కూరగాయలు, పూల పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో సుమారు 5,500 మంది రైతులకు నష్టం వాటిల్లగా, వ్యవసాయ ఆధారిత కూలీలు 30 వేల మంది ఉపాధికి తీవ్ర విఘాతం కలిగింది. గత రెండు మాసాల్లో గోదావరికి వరదలు రెండు సార్లు సంభవించగా, మూడు అల్ప పీడనాలు, రెండు వాయుగుండాలతో భారీ వర్షాలు కురిశాయి.
లెక్కల్లో లేని ‘సి–క్లాస్’
గోదావరి లంకల్లో జిరాయితీ భూములతో పాటు, సి–క్లాస్ పట్టాలు పొందిన రైతులున్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నష్ట పరిహారం అందిస్తుంది. కానీ సి–క్లాస్ భూములున్న రైతులకు ఎటువంటి పరిహారమూ అందడం లేదు. ఉదాహరణకు, పెరవలి మండలంలో ఎక్కువ లంక భూములున్నాయి. ఇక్కడ జిరాయితీ భూములు సుమారు 1,400 ఎకరాలుంటే, సి–క్లాస్ పట్టాలు పొందిన రైతులకు 1,600 ఎకరాలు ఉన్నాయి. గోదావరి వరదల కారణంగా పంటలన్నీ నాశనమైనా, కేవలం జిరాయితీ భూములున్న వారికే పరిహారం దక్కుతుంది. ఇందులో 1,500 మంది రైతులుంటే, సి–క్లాస్ పట్టాలున్న వారు 998 మంది ఉన్నారు. ఇలా జిల్లాలోని లంకల్లో జిరాయితీ భూములకు కాకుండా, సి–క్లాస్ పట్టాలు పొందిన రైతులకూ పంటల నష్ట పరిహారం దక్కడం లేదు.
రూ.కోట్లలో నష్టం
గోదావరి లంకల్లో భూములు సారవంతమైనవి కావటంతో ఇక్కడ ఎక్కువగా వాణిజ్య పంటలైన కంద, అరటి, పసుపు సాగు చేస్తారు. వీటికి ఎకరానికి రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షల పెట్టుబడి అవుతుంది. అన్నీ అనికూలిస్తేనే ఆయా పంటలకు ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు మిగులుతుంది. అదే వరదల సమయాల్లో సర్వం కోల్పోక తప్పదు. వివిధ రకాల పంటల ఉత్పత్తులకు వరదల వల్ల ఏటా సుమారు రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్ల నష్టం వాటిల్లుతుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గోదావరి వరదల వల్ల నష్టపోయిన రైతులకు రూ.24 కోట్ల నష్ట పరిహారం ఇచ్చారు, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కానరావడం లేదని రైతులు మండిపడుతున్నారు. కనీసం పంట నష్టం అంచనాలు కూడా వేయలేదంటున్నారు.
ముక్కామల వద్ద గోదావరి వరదలో పాడైపోయిన లంక పంటలు
గంట గంటకూ పెరుగుతూ..
వశిష్ఠ గోదావరికి ఈ నెలలో రెండోసారి వరద పోటెత్తటంతో దిగువ లంకలో పంటలన్నీ నీటమునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం క్రితం తీవ్ర నష్టాలు తెచ్చిన ఉగ్ర గోదావరి వరద ఇప్పుడు మరలా రావటంతో లబోదిబోమంటున్నారు. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరికి వరద పోటెత్తడంతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. పెరవలి మండలంలో కానూరు, కానూరు అగ్రహారం, ఉసులుమర్రు, తీపర్రు, కాకరపర్రు, ఉమ్మిడివారిపాలెం, ఓదూరివారిపాలెం, ముత్యాలవారిపాలెం, ముక్కామల, లంకమాలపల్లి, ఖండవల్లి, మల్లేశ్వరం గ్రామాల్లో 900 ఎకరాల్లో దిగువ లంకల్లోని పంటలు నీట మునిగాయి. ఇప్పటికే ఈ లంకల్లో వంగ, బెండ, బీర, ఆనప, చిక్కుడు, క్యాబేజీ, దొండ పందిర్లు, పచ్చిమిరప తోటలు, ఆకుకూరలైన గోంగూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర వంటివి మొత్తం చనిపోయాయి. మిగిలిన అరటి, కంద, పసుపు, పూల పంటలకూ నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజులుగా గోదావరి వరద నిలకడగా ఉన్నా, శనివారం రాత్రి నుంచి గంట గంటకూ పెరగటంతో లంక రైతులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. గతేడాది జూలైలో రెండు సార్లు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పంటలు పూర్తిగా పాడైపోయాయి. అలాగే ఈ ఏడాదీ జరుగుతుందేమోనని రైతులు ముందు జాగ్రత్తలు తీసుకున్నా.. పంటలు దక్కే పరిస్థితి కానరావడం లేదు.

జల దిగ్బంధం

జల దిగ్బంధం

జల దిగ్బంధం

జల దిగ్బంధం

జల దిగ్బంధం

జల దిగ్బంధం