ప్రారంభించినారు | - | Sakshi
Sakshi News home page

ప్రారంభించినారు

Aug 17 2025 6:54 AM | Updated on Aug 17 2025 6:54 AM

ప్రార

ప్రారంభించినారు

దేవరపల్లి: మన జిల్లాతో పాటు ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు 2025–26 పంట కాలానికి గాను అక్టోబర్‌ నుంచి పొగాకు నాట్లు ప్రారంభం కానున్నాయి. ఒకవైపు 2024–25 పంట కాలానికి సంబంధించిన పొగాకు అమ్మకాలు ఇంకా జరుగుతున్నాయి. ఇదే తరుణంలో పొగాకు బోర్డు 2025–26 పంట కాలానికి ఉత్పత్తి కోటాను ఖరారు చేయడం.. మరోవైపు వాతావరణం అనుకూలంగా ఉండటంతో రైతులు దుక్కులు చేసి, పొగాకు సాగుకు అవసరమైన నారుమడులు కట్టి విత్తనాలు వేయడంలో బిజీగా ఉన్నారు. అధిక దిగుబడులు ఇచ్చే వంగడాల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా ఐటీసీ సరఫరా చేస్తున్న ఎల్‌వీ–7, 1353 వంగడాలతో నారుమడులు వేస్తున్నారు. ఇవి ఎకరాకు సగటున 12 నుంచి 14 క్వింటాళ్ల దిగుబడి ఇస్తున్నాయి. దీంతో పాటు పొగాకు బోర్డు, సీటీఆర్‌ఐ కూడా రైతులకు వంగడాలను సరఫరా చేస్తున్నాయి.

పంట నియంత్రణ చర్యలు

రాజమహేంద్రవరం రీజియన్‌లో దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడేల్లోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో 2024–25 పంట కాలంలో 58 మిలియన్‌ కిలోల పొగాకు ఉత్పత్తికి టుబాకో బోర్డు అనుమతించింది. అయితే, గత ఏడాది లెక్కకు మిక్కిలిగా లాభాలు రావడంతో రైతులు సుమారు 80 మిలియన్‌ కిలోల వరకూ ఉత్పత్తి చేశారన్నది అధికారుల అంచనా. మార్కెట్‌ పరిస్థితులు మారడంతో గత సంవత్సరం మాదిరిగా ఈసారి ధర దక్కక నష్టపోతున్నామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పంట నియంత్రణ చర్యలకు బోర్డు ఉపక్రమించింది. ఇందులో భాగంగా 2025–26 పంటకాలంలో పొగాకు ఉత్పత్తిని 48 మిలియన్‌ కిలోలకు పరిమితం చేసింది. గత ఏడాది బ్యారన్‌కు 45 క్వింటాళ్ల ఉత్పత్తికి అనుమతించగా.. ప్రస్తుతం దానిని 36 క్వింటాళ్లకు కుదించింది.

విస్తీర్ణం పెరిగే చాన్స్‌

ఎకరం విస్తీర్ణంలో వేసిన నర్సరీలోని నారు దాదాపు 900 ఎకరాలకు సరిపోతుంది. ఈ ఏడాది పొగాకు ధరలు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.350 నుంచి రూ.392 వరకూ పలికింది. ఈ నేపథ్యంలో 2025–26 పంట కాలంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున నారుమడుల విస్తీర్ణం కూడా పెరుగుతుందని రైతు సంఘాల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. నారుమడులకు ఎకరం భూమి కౌలు రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకూ పలుకుతోంది. నారుమడుల కోసం ఆగస్టు నుంచి డిసెంబర్‌ వరకూ రైతులు తమ భూములను కౌలుకు ఇస్తున్నారు. డిసెంబర్‌ 16 తర్వాత నారుమడులను ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ కౌలుదారులు భూములను ధైర్యంగా కౌలుకు తీసుకుంటున్నారు. దేవరపల్లి మండలం పల్లంట్ల, బందపురం, లక్ష్మీపురం, యర్నగూడెం, సంగాయగూడెం, చిన్నాయగూడెం, గోపాలపురం మండలం గోపాలపురం, చిట్యాల, వేళ్లచింతలగూడెం, చిట్యాల గ్రామాల్లో పొగాకు నారుమడులు ముమ్మరంగా వేస్తున్నారు.

ట్రే నర్సరీలు

పలు గ్రామాల్లో రైతులు షేడ్‌ నెట్‌ పందిళ్లు వేసి, ట్రేలు ఏర్పాటు చేసి ఎక్కువగా నారు పెంచుతున్నారు. ఈవిధంగా పెంచిన నారు నాణ్యతగా ఉండి, చీడపీడలను తట్టుకుంటుందని చెబుతున్నారు. నారు రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ మంది దీనివైపే మొగ్గు చూపుతున్నారు. పెద్ద రైతులైతే సొంతంగానే ట్రే నారు పెంచి తోటలు వేస్తున్నారు. నర్సరీలకు అవసరమైన ట్రేలను బోర్డు ద్వారా సరఫరా చేస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు, ఒంగోలు, కనిగిరి ప్రాంతాల నుంచి రైతులు వచ్చి ఇక్కడి నారు కొనుగోలు చేసి తీసుకు వెళ్తూంటారు.

ఫ పొగాకు నారుమడులకు శ్రీకారం

ఫ అధిక దిగుబడులిచ్చే

వంగడాల వైపు రైతుల చూపు

ఫ నిబంధనలు

పాటించాలంటున్న అధికారులు

రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

వచ్చే ఏడాదికి నర్సరీ దశ నుంచే బోర్డు నిబంధనలను కఠినతరం చేసింది. నారుమడి కట్టే ప్రతి రైతూ భూమిని బోర్డులో రిజిస్ట్రేషన్‌ చేయించుకుని రసీదు తీసుకోవాలి. అలా రసీదు ఉన్న వారి వద్ద మాత్రమే రైతులు నారు కొనుగోలు చేయాలి. వారు కూడా రసీదు పొందాలి. నాట్లు వేసే సమయంలో ఆ రసీదును మొక్క ఫారంతో కలిపి బోర్డులో అందజేస్తేనే పొగాకు బ్యారన్‌ రిజిస్ట్రేషన్‌ జరుగుతుంది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.

– జీఎల్‌కే ప్రసాద్‌, రీజినల్‌ మేనేజర్‌,

పొగాకు బోర్డు, రాజమహేంద్రవరం

కాసుల పంట

పొగాకు బోర్డు రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలో సుమారు 25 వేల హెక్టార్లలో పొగాకు సాగు జరుగుతోంది. మూడేళ్లుగా ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. నారుమడులు కడుతున్న రైతుల్లో ఎక్కువ మంది కౌలుదారులే ఉన్నారు. ఐదు వేలం కేంద్రాల పరిధిలో దాదాపు 400 కౌలు రైతులు నారుమడులు కట్టి వ్యాపారం చేస్తున్నారు. ఒక్కో రైతు ఎకరం నుంచి ఐదెకరాల వరకూ నారుమడులు వేస్తున్నారు. 2021–22లో ఎకరం నారు (6 వేల మొక్కలు) రూ.5 వేలు పలకగా, 2022 సీజన్‌లో అది ఏకంగా రూ.18 వేలకు పెరిగింది. 2023–24లో కూడా రూ.16 వేలు పలకడంతో రైతులకు కాసుల పంట పండింది. అయితే, ఈ రెండు సీజన్ల ఎకరం విస్తీర్ణంలో నారుమడులు కట్టిన రైతులు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ కూడా ఆదాయం పొందారు. 2024 సీజన్‌లో మాత్రం నారు ధర పడిపోవడంతో చాలా మంది రైతులు నష్టాలు చవిచూశారు. కొంత మందికి పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి ఎదురైంది.

ప్రారంభించినారు1
1/1

ప్రారంభించినారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement