
ఎమ్మెల్యే సార్ కోప్పడుతున్నారు
● ప్రారంభోత్సవాలకు
డ్వాక్రా మహిళలను తీసుకురండి
● యానిమేటర్లపై ఒత్తిడి
● గోరంట్ల ‘ప్రత్యేక’
అనుచరురాలి దందా
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం అరకొర హామీల అమలతో ప్రజలు సంతోషంగా ఉన్నారంటూ కలరింగిస్తోంది. ఒక పక్క సీఎం చంద్రబాబు అన్ని హామీలు అమలు చేసేశాం.. అమలు కాలేదన్న వారి నాలుక మందమంటూ మీడియా సాక్షిగా హుంకరింపులకు దిగుతున్నారు. ఈ తతంగానికి తెర వెనుక మరో కోణం ఉంది. సంక్షేమ పథకాల అమలుతో ప్రజలంతా సంతోషించేస్తున్నారంటూ సొంత మీడియాలో డబ్బా కొట్టుకునేందుకు డ్వాక్రా మహిళలను పావుగా వాడుతున్నారు. ఇందుకోసం ఉన్నతాధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో యానియేటర్లపై తీవ్ర ఒత్తిడి తెచ్చి డ్వాక్రా మహిళలను ప్రభుత్వ, పార్టీ సంబంధ కార్యక్రమాలకు తరలించాలని టార్గెట్లు పెడుతున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రత్యేక అనుచరురాలి దందాయే ఇందుకు నిదర్శనం. ‘ సార్ కోప్పడుతున్నారు.. మీరంతా మీ పరిధిలో డ్వాక్రా మహిళలను సీ్త్రశక్తి పథకం ఉచిత బస్సు ప్రారంభోత్సవం, సీఎం, డిప్యూటీ సీఎం క్షీరాభిషేకానికి తీసుకురాకపోతే తరువాత మీ ఇష్టం అంటూ బెదిరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, పార్టీ సంబంధ కార్యక్రమాల పేరిట నెలకు 10, 15 రోజులు ఇలా తిప్పడంపై డ్వాక్రా మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాగా.. సీ్త్రశక్తి పథకం ఉచిత బస్సు ప్రారంభోత్సవం ప్రభుత్వ అధికార కార్యక్రమం అయినప్పటికీ ఆర్టీసీ బస్సులపై ముఖ్య అనుచరురాలి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది.