
ఉప ఎన్నికలతో ప్రజాస్వామ్యానికి అప్రతిష్ట
● రిగ్గింగ్ డేగా ఆగస్టు 12
● కూటమి ప్రభుత్వ తీరు దారుణం
● అక్రమ కేసులకు భయపడేది లేదు
● వైఎస్సార్ సీపీ యువజన విభాగం
రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా
రాజమహేంద్రవరం సిటీ: ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యానికి అప్రతిష్టగా మారాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఆయన శనివారం రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో ఉప ఎన్నికలు జరిగిన ఆగస్టు 12వ తేదీకి ప్రజాస్వామ్యంలో రిగ్గింగ్ డేగా గుర్తింపు వచ్చిందన్నారు. ప్రతిపక్షాలకు చెందిన పోలింగ్ ఏజెంట్లు లేకుండా, పోటీ చేసిన అభ్యర్థులు ఓటు వేయకుండా చేసి.. గొప్పగా ఎన్నికలు నిర్వహించామని చెప్పుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని ధ్వజమెత్తారు. పులివెందులలో గెలుపు కోసం జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు నుంచి దొంగ ఓటర్లను దిగుమతి చేసి, పోలీసుల సాయంతో రిగ్గింగ్ చేయించారన్నారు. తెలుగుదేశం పార్టీ మూకలు పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని అన్ని పోలింగ్ బూతుల్లో వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై దాష్టీకానికి తెగబడ్డాయన్నారు. పక్క జిల్లాకు చెందిన మంత్రి పోలింగ్ బూతుల్లోకి జొరబడి వై్‌ఎస్సార్ సీపీ ఏజెంట్లకు బయటకు గెంటివేయించారన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం వైఎస్సార్ సీపీ కార్యకర్తలను, సాను భూతి పరులను మాత్రం బెదిరించారన్నారు. కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు బెదిరిపోయే ప్రసక్తే లేదన్నారు. కేవలం రెండు రోజులు కురిసిన వర్షానికి ముంపు బారిన పడిన రాజధాని ప్రాంతంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోందన్నారు. మంత్రి నారాయణ అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తామని చెబుతున్నారని, ఆ దిశగా అక్కడ పనులు జరగడం లేదన్నారు. నాలుగు ఐకానిక్ టవర్లు నిర్మించినంత మాత్రాన రాజధాని నిర్మాణం పూర్తయినట్టు కాదన్నారు. 138 ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చిన స్థలాల్లో ఏ మేరకు నిర్మాణాలు జరుగుతున్నాయో తెలియడం లేదన్నారు.