
నేడు గుళ్లపల్లి ఘనపాఠికి రాజాలక్ష్మి అవార్డు ప్రదానం
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం శివారు కొంతమూరులోని దత్తాత్రేయ వేదవిద్య గురుకులం గౌరవాధ్యక్షుడు, ప్రధాన ఆచార్యుడు గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠి మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకోనున్నారు. చైన్నెకి చెందిన రమణయ్యరాజా 1979 నుంచి వివిధ రంగాల్లో నిష్ణాతులకు రాజాలక్ష్మి అవార్డులను అందజేస్తున్నారు. ఈ మేరకు వేదవిద్య ప్రచారానికి గుళ్లపల్లి ఘనపాఠి చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆదివారం ఉదయం 11.30 గంటలకు వేదవిద్య గురుకులం ప్రాంగణంలో ఈ అవార్డును అందజేయనున్నారు. సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. సంస్థ రజతోత్సవ సందర్భంలో ఈ అవార్డును అందుకోవడం దత్తాత్రేయుని ఆశీస్సులుగా భావిస్తున్నానని సీతారామచంద్ర ఘనపాఠి తెలిపారు. గురుకులం కార్యవర్గం తరఫున భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు ఈ వివరాలు తెలిపారు.
శ్రీఖండ్ కై లాష్ మహాదేవ్ యాత్ర
బిక్కవోలు: మండలంలోని కొంకుదురు చెందిన నలుగురు యువకులు శ్రీఖండ్ కైలాష్ మహాదేవ్ యాత్ర పూర్తి చేసుకుని స్వగ్రామానికి వచ్చారు. పంచ కై లాసాలలో ఒకటిగా భావించే ఈ ప్రదేశం హిమాచల్ ప్రదేశ్‌లో సముద్ర మట్టానికి 18,570 అడుగుల ఎత్తులో ఉంది. పోతంశెట్టి మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో చిన్నం వెంకటరెడ్డి, మల్లిడి సురేంద్రరెడ్డి, కర్రి ఉమామహేశ్వరరెడ్డి, పడాల వెంకటరెడ్డి ఈ యాత్రను చేసి 72 అడుగుల పర్వత లింగాన్ని దర్శించుకున్నారు.
అన్నవరప్పాడుకు
పోటెత్తిన భక్తులు
పెరవలి: శ్రావణ మాసంలోని మూడో శనివారం సందర్భంగా అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామునుంచే ఆలయ ప్రాంగణం చుట్టూ క్యూలో నిలబడ్డారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. దాతల ఆర్థిక సాయంతో 9,500 మందికి అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి శనివారం భక్తులకు అన్నసమారాధనతో పాటు ప్రసాదాలను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఆలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన స్వామి వారికి పూలంకరణ, భక్తులకు ప్రసాదం, నిత్యగోత్రార్చన, అన్నదానం వంటి కార్యక్రమాలకు భక్తుల నుంచి విరాళాలు స్వీకరిస్తున్నామని తెలిపారు.

నేడు గుళ్లపల్లి ఘనపాఠికి రాజాలక్ష్మి అవార్డు ప్రదానం