
ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): స్వాతంత్య్ర సమర యోధుడు, సంఘ సంస్కర్త సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని శనివారం కలెక్టరేట్‌లో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ 1909 ఆగస్టు 16న శ్రీకాకుళం జిల్లా బారువ గ్రామంలో జన్మించిన గౌతు లచ్చన్న.. చిన్న వయసులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రవేశించారన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి వాటిలో చురుకుగా పాల్గొని, బెర్హంపూర్, రాజమండ్రి జైళ్లలో కఠినమైన శిక్షలను అనుభవించారన్నారు. ఆయన జీవితాంతం వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, రైతుల సంక్షేమం, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేశారన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసి, గాంధేయవాదిగా సామాజిక న్యాయం కోసం పోరాటం చేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి.శశాంక, డీఆర్‌ఓ సీతారామమూర్తి తదితరులు పాల్గొన్నారు.