
ఉచిత బస్సు పేరుతో మోసం
చాగల్లు: ఉచిత బస్సు ప్రయాణం పేరుతో రాష్ట్రంలో మహిళలను సీఎం చంద్రబాబు మరోసారి మోసం చేశారని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ సూపర్ సిక్స్‌లో భాగంగా సీ్త్ర శక్తి పథకాన్ని ఎన్నో ఆంక్షలతో అమలు చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత అమలు చేస్తున్న ఈ పథకానికి ఎన్నో మెలికలు పెట్టారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ ప్రకారం అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని, కానీ ఇప్పుడు కొన్ని బస్సులకు మాత్రమే అమలు చేస్తున్నారన్నారు. ఆర్టీసీలో 16 రకాల బస్సులు ఉంటే కేవలం ఐదు రకాల బస్సుల్లో, అది కూడా షరతులతో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చారన్నారు. దీని వల్ల దూర ప్రాంతాలకు వెళ్లే మహిళలకు ఏమాత్రం ఉపయోగం ఉండదన్నారు. కూటమి ప్రభుత్వం అంటే కోతల ప్రభుత్వంగా మారిందని వ్యాఖ్యానించారు. ఈ నాలుగేళ్లలో కేవలం మహిళలకు సుమారు రూ.8 వేలు కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయిస్తుండగా, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మహిళలకు వివిధ పథకాల ద్వారా సుమారు రూ.1.26 లక్షల కోట్లు అందించిందన్నారు. రాష్ట్రంలో వైద్యం, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేసిందని, ఆరోగ్యశ్రీని అటకెక్కించిందని, రైతన్నలకు పెట్టుబడి సాయం అందించకుండా అప్పుల పాలు చేసిందని విమర్శించారు. ఇంటి వద్దకే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడంతో 9,280 మంది ఆపరేటర్లు వీధుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.