
18 నుంచి జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు శిక్షణ
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో ఈ నెల 18 నుంచి మండల పరిషత్తు, జిల్లా పరిషత్తులలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఆ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్‌వీ ప్రసాదరావు తెలిపా రు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చే శారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతిపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలోని 240 మందికి బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఉంటుందన్నారు. 18 నుంచి ప్రారంభమయ్యే బ్యాచ్‌కు 60 మంది హాజరవుతారని, ఆయా కార్యాలయాల్లో కొత్తగా నియమితులైన వారికి ఈ శిక్షణ ఉంటుందన్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వారి విధులు, బాధ్యతలు, ఫైళ్ల నిర్వహణ, ప్రభుత్వ పథకాలు వంటి అంశాలను నిపుణులు వివరిస్తారన్నారు.
జాతీయ హాకీ పోటీలకు ఉప్పాడ క్రీడాకారులు
కొత్తపల్లి: పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో జరిగే 15వ హాకీ ఇండియా జూనియర్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే మన రాష్ట్ర జట్టుకు ఉప్పాడకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు, హాకీ కోచ్ రవిరాజ్ గురువారం తెలిపారు. ధర్మవరంలో ఏప్రిల్‌లో జరిగిన రాష్ట్ర జూనియర్ హాకీ చాంపియన్ షిప్ పోటీల్లో ఉప్పాడకు చెందిన చొక్కా డేవిడ్, మేరుగు హెబెల్ ప్రతిభ కనబరిచి, చాంపియన్ షిప్‌కు సాధించడంలో కీలకపాత్ర పోషించారన్నారు. ఈ క్రీడాకారులు స్కూల్ గేమ్ అండర్– 19 జాతీయ పోటీల్లో కూడా పాల్గొన్నారన్నారు. కాగా.. జాతీయ జూనియర్ హాకీ పోటీలు శుక్రవారం నుంచి జలంధర్‌లో ప్రారంభమవుతాయని, శనివారం జరిగే పోటీల్లో ఈ క్రీడాకారులు పాల్గొంటారన్నారు.