వద్దన్నా..స్మార్ట్‌ దెబ్బ! | - | Sakshi
Sakshi News home page

వద్దన్నా..స్మార్ట్‌ దెబ్బ!

Aug 12 2025 8:07 AM | Updated on Aug 12 2025 8:07 AM

వద్దన

వద్దన్నా..స్మార్ట్‌ దెబ్బ!

ప్రజాసంఘాల

ఆందోళన బాట

స్మార్ట్‌ మీటర్ల బిగింపుపై ప్రజా సంఘాలు, సీపీఐ తదితర పార్టీలు ఆందోళన బాట పడుతున్నాయి. రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నాయి. స్మార్ట్‌ మీటర్లు వద్దని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని సంతకాల సేకరణ కార్యక్రమం సైతం నిర్వహించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నా.. కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదు.

సాక్షి, రాజమహేంద్రవరం: విద్యుత్‌ వినియోగదారులకు ‘స్మార్ట్‌ మీటర్ల’ పీడ విరగడవడం లేదు. వినియోగదారులు వద్దని తిరస్కరిస్తున్నా.. రాజకీయ పార్టీల నేతలు, కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలకు, అపార్ట్‌మెంట్లకు బిగింపు ప్రక్రియ చేపడుతోంది. త్వరలోనే గృహ వినియోగదారులకు, వ్యవసాయ కనెక్షన్లకు సైతం అమర్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రీపెయిడ్‌ ఆప్షన్‌తో వీటిని రూపొందించారు. సెల్‌ఫోన్‌ తరహాలో ముందుగానే రీచార్జ్‌ చేసుకుంటేనే విద్యుత్‌ సరఫరా ఉంటుంది. లేదంటే ఆటోమెటిక్‌గా సరఫరా ఆగిపోతుంది. చిన్నపాటి మొబైల్‌ చార్జర్‌ అయినా.. విద్యుత్‌ వినియోగిస్తున్నట్లు బిల్లు వచ్చేస్తుంది. ప్రజలు తమ కష్టార్జితం మొత్తం విద్యుత్‌ బిల్లులకు కట్టాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అన్ని వర్గాలూ వ్యతిరేకిస్తున్నా.. కూటమి ప్రభుత్వం మాత్రం ఆదాయం సృష్టించే క్రమంలో ముందుకు సాగుతోంది.

రంగం సిద్ధం

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 7,82,170 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ సంస్థలవి 10,607, ప్రైవేటు కనెక్షన్లు 7,71,563 ఉన్నాయి. ప్రతి నెలా సుమారు 108.85 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగిస్తున్నారు. ఇందుకు ప్రతి నెలా రూ.74.41 కోట్ల బిల్లులు ప్రభుత్వానికి, విద్యుత్‌ శాఖకు చెల్లిస్తున్నారు. తొలుత 33 కేవీ ఫీడర్లు, 11 కేవీ ఫీడర్లు, నాన్‌ అగ్రికల్చర్‌, ప్రభుత్వ సర్వీసులు, ఇండస్ట్రియల్‌, కమర్షియల్‌ కనెక్షన్లకు విద్యుత్‌ శాఖ స్మార్ట్‌ మీటర్లు బిగించాలని భావించి అమలు చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 45,000కు పైగా స్మార్ట్‌ మీటర్లు బిగించినట్లు విద్యుత్‌ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అనంతరం గృహాలకు బిగించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. 500 యూనిట్ల పైబడి విద్యుత్‌ వినియోగిస్తున్న గృహాలకు బిగించేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి సింహభాగం వినియోగదారులు వ్యతిరేకిస్తున్నారు. తాము స్మార్ట్‌ మీటర్లకు వ్యతిరేకమని చెబుతున్నా విద్యుత్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా స్మార్ట్‌ మీటర్‌ బిగించుకోకపోతే.. ప్రస్తుతం ఉన్న మీటర్‌కు కమర్షియల్‌ బిల్‌ బనాయిస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ఇదే విషయాన్ని విలేకరుల సమావేశంలో వెల్లడించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఏది ఏమైనా స్మార్ట్‌ మీటర్లు బిగించుకోవాల్సిందేనంటూ తెగేసి చెబుతున్నారు. అనుమతి లేకుండా స్మార్ట్‌ మీటర్లు బిగించే అధికారం విద్యుత్‌ శాఖకు లేదని న్యాయ నిపుణులు వెల్లడిస్తున్నా.. ఆ శాఖ అధికారులు మాత్రం ఏదోలా అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

విద్యుత్‌ చార్జీల మోత

ప్రస్తుతమున్న మీటర్‌ స్థానంలో స్మార్ట్‌ మీటర్‌ అమరుస్తున్నారు. నార్మల్‌ మీటర్‌ ఉన్న సమయంలో కమర్షియల్‌ విద్యుత్‌ వినియోగానికి రూ.3 వేలు బిల్లు వస్తే.. స్మార్ట్‌ మీటర్‌ అమర్చిన అనంతరం రూ.6 నుంచి రూ.10 వేల వరకూ వస్తోంది. ఇదేమని విద్యుత్‌ అధికారుల వద్దకు వినియోగదారులు పరుగులు తీస్తున్నారు. తమకేమీ తెలియదని వారు సమాధానం ఇస్తున్నారు. స్మార్ట్‌ మీటర్‌ బిగించిన అనంతరం విద్యుత్‌ లోడ్‌ను బట్టి గంట, గంటకూ బిల్లు రేట్లు మారుతాయి. విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉండే సమయంలో వాడితే చార్జీల మోత తప్పదు. ఉదయం ఒక ధర, మధ్యాహ్నం ఒక ధర, రాత్రి ఇంకో ధర ఉంటుంది. స్మార్ట్‌ మీటర్‌తో ప్రతి నెలా సాధారణ వినియోగదారుడిపై రూ.500 నుంచి రూ.800 వరకు అదనపు భారం పడుతుంది. ప్రస్తుతం నెలంతా విద్యుత్‌ వినియోగించుకుని బిల్లు వచ్చిన అనంతరం చెల్లిస్తున్నాం. అలాంటి ప్రక్రియకు బ్రేక్‌ పడుతుంది. సెల్‌ఫోన్‌, డిష్‌టీవీ తరహా ముందస్తుగా స్మార్ట్‌ మీటర్‌కు రీచార్జ్‌ చేసుకోవాలి. రీచార్జ్‌ అమౌంట్‌ పూర్తవగానే విద్యుత్‌ సరఫరా దానంతట అదే ఆగిపోతుంది.

భారం వినియోగదారుడికే..

స్మార్ట్‌ మీటరు ఖరీదును వినియోగదారుడే భరించాలి. సింగిల్‌ ఫేజ్‌ మీటరు ఖరీదు రూ.8,927. త్రీ ఫేజ్‌ మీటరు రూ.17,286. ఈ మొత్తాన్ని 93 నెలల పాటు ఇన్‌స్టాల్‌ మెంట్లుగా బిల్లుతో పాటు వసూలు చేస్తారు. స్మార్ట్‌ మీటర్‌ మామూలు విద్యుత్‌ మీటర్‌ మాదిరిగా విద్యుత్‌ వాడకాన్ని రికార్డు చేసేందుకు మాత్రమే ఉపయోగించే పరికరం కాదు. మీటరును రిమోట్‌ నుంచి ఆపరేట్‌ చేయవచ్చు. పీక్‌ సమయం పేరుతో అధిక చార్జీలు వసూలు చేసేందుకు ఇది ఎంతగానో ఉపయుక్తం కానుంది. ఉదాహరణకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు పీక్‌ సమయంగా నిర్ణయించారు. ఈ సమయంలో ఎక్కువ విద్యుత్‌ చార్జీ వసూలు చేస్తారు. వేసవి కాలంలో ఎక్కువ రేట్లు వసూలు చేసే అవకాశం ఉంది. అందుకోసం ఈ ఏర్పాటు చేశారు. ఇది ప్రజలకు భారం అవుతుంది.

చంద్రబాబు, లోకేష్‌ ఏమయ్యారు..?

ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించిన చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ ప్రస్తుతం ప్రోత్సహించడంపై వినియోగదారులు విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యవసాయ బోరుబావుల వద్ద స్మార్ట్‌ మీటర్లు పెడితే పగలకొట్టండని పిలుపునిచ్చిన చంద్రబాబు, లోకేష్‌ ప్రస్తుతం వ్యవసాయ కనెక్షన్లకు అమర్చేందుకు సన్నాహాలు ప్రారంభించడంపై రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విమర్శించిన వారు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయడం మంచి ప్రక్రియ అని చెప్పడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు.

విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటు

పరం చేసే కుట్ర

విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. అందులో భాగంగానే స్మార్ట్‌ మీటర్లు తీసుకువచ్చింది. రాష్ట్రంలో స్మార్ట్‌ మీటర్లు పెట్టిన షాపులకు వస్తున్న బిల్లులు చూసి చిరు వ్యాపారులు గుండెలు బాదుకుంటున్నారు. స్మార్ట్‌ మీటర్లు బిగించాలంటే మన అనుమతి కావాలి. ఒక మీటరు బిగిస్తే అనుమతించినట్టే. క్రమేణా మన కరెంటు కనెక్షన్‌ అదానీ చేతిలోకి పోతుంది. రాజమహేంద్రవరంలో ఇప్పటికే వందలాది మీటర్లు ధ్వంసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రక్రియ కొనసాగితేనేగాని ప్రభుత్వంలో మార్పు రాదు.

– తాటిపాక మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి

జిల్లాలో విద్యుత్‌ కనెక్షన్లు

డివిజన్‌ క్యాటగిరి–1 క్యాటగిరి–2 క్యాటగిరి–3 క్యాటగిరి–4 క్యాటగిరి–5

నిడదవోలు 2,26,895 24,220 1,257 5,610 30,064

రాజమహేంద్రవరం రూరల్‌ 1,99,806 20,930 778 4,621 15,768

రాజమహేంద్రవరం అర్బన్‌ 2,14,334 33,285 824 2,874 904

స్మార్ట్‌ విద్యుత్‌ మీటర్ల ఏర్పాటుపై

కూటమి ప్రభుత్వం ముందుకే..

జిలా ్లవ్యాప్తంగా 45,000కు పైగా

మీటర్ల బిగింపు

మీటర్‌ వద్దంటే కమర్షియల్‌ చార్జీలు

మోపుతామని బెదిరింపులు

పీక్‌ అవర్స్‌లో అధిక బిల్లులు

మోపి దోచుకునేందుకు కుట్ర

గతంలో రూ.2 వేలు వచ్చే బిల్లు.. ప్రస్తుతం రూ.10 వేలకు చేరుతున్న వైనం

ప్రతిపక్షంలో ఉండగా వ్యతిరేకించిన

చంద్రబాబు, లోకేష్‌

వద్దన్నా..స్మార్ట్‌ దెబ్బ!1
1/2

వద్దన్నా..స్మార్ట్‌ దెబ్బ!

వద్దన్నా..స్మార్ట్‌ దెబ్బ!2
2/2

వద్దన్నా..స్మార్ట్‌ దెబ్బ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement