
స్వామీ...నీ దయ రాదా!
● సత్యదేవుని సన్నిధిన శానిటరీ
సిబ్బంది ఆకలి కేకలు
● అందని జూన్, జూలై జీతాలు
● నెలకు రూ.59 లక్షల చొప్పున
350 మంది సిబ్బందికి బకాయి
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో పారిశుధ్య కార్మికులకు జీతాల చెల్లింపు సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. జూన్, జూలై నెలల జీతాలు ఇంకా అందకపోవడంతో 350 మంది ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా ఎక్కువ మొత్తాలలో జీతాలు తీసుకునే వేతన జీవులకే ఒక నెల జీతం ఆలస్యం అయితే ఇబ్బంది పడతారు. ఈ ఎంఐలు, అద్దెలు, వివిధ చెల్లింపులు ఆలస్యం అవుతాయి. అటువంటిది చిన్నపాటి జీతం రెండు నెలలు నుంచి రాకపోతే వారి పరిస్థితి ఏమిటో ఊహించొచ్చు.
ఐదు నెలలుగా ఇదే తంతు
ఐదు నెలలుగా జీతాలు ఆలస్యం అవుతున్నాయి. పాత కాంట్రాక్ట్ సంస్థ కేఎల్‌టీఎస్ కాలపరిమితి ముగిసిన తరువాత మార్చి నెల నుంచి శానిటరీ కాంట్రాక్ట్ విజయవాడకు చెందిన కనకదుర్గా మేన్‌పవర్ సంస్థకు అప్పగించారు. మార్చి జీతాలు ఆలస్యమవడంతో అప్పట్లో సాక్షి దినపత్రికలో ఏప్రిల్ 25వ తేదీన ‘మాకు జీతాలు ఎప్పుడిస్తారు స్వామీ...? అంటూ వార్త ప్రచురితమవడంతో ఏప్రిల్ 30న అకౌంట్‌లో జీతాలు వేశారు. ఏప్రిల్ జీతాలు కూడా పడకపోవడంతో సాక్షి దినపత్రికలో మే నెల 26న ‘వీరి కష్టం తుడిచే వారేరీ!’ శీర్షికన కథనం ప్రచురించడంతో అధికారులు స్పందించి జీతాలు చెల్లించారు. మే నెల జీతాలు కూడా జూన్ రెండో వారంలో చెల్లించారు. జూలై నెలలో ఫేక్ పీఎఫ్ చలానాలు ఇచ్చారంటూ వివాదం రావడంతో ఆ చలానాలు వెరిఫై చేయడం, పీఎఫ్ కార్యాలయ సిబ్బంది తనిఖీలు, కాంట్రాక్టర్‌పై కేసులు, ఇద్దరి ఉద్యోగుల సస్పెన్షన్ వంటి పరిణామాలతో జూన్, జూలై జీతాలు ఇంకా చెల్లించలేదు.
సెక్యూరిటీ కాంట్రాక్టర్‌తో
జీతాలిప్పించే ప్రయత్నం విఫలం
ఫేక్ పీఎఫ్ చలానాల ఆరోపణలతో కనకదుర్గ సంస్థను పక్కన పెట్టి సెక్యూరిటీ కాంట్రాక్ట్ సంస్థ ‘మాక్స్’ ద్వారా శానిటరీ సిబ్బందికి జీతాలిప్పించేందుకు కమిషనర్ కార్యాలయానికి ఫైలు పంపారు. దీనిపై కమిషనర్ అభ్యంతరం తెలిపారు. దీంతో మళ్లీ కనకదుర్గా సంస్థ ద్వారా జూన్, జూలై నెలలకు జీతాలిచ్చేందుకు వీలుగా ఆ సంస్థతో రెండు నెలల పీఎఫ్ కట్టించారు. రూ.30 లక్షల పీఎఫ్ సొమ్ము చెల్లించి ఆ రశీదులు దేవస్థానానికి ఆ సంస్థ ప్రతినిధులు జమ చేశారు. ఇది జరిగి వారం అయినా ఇంకా శానిటరీ సిబ్బంది అకౌంట్లలో జీతాలు పడలేదు.
నెరవేరని కమిషనర్ హామీ
ఈ నెల ఒకటో తేదీన అన్నవరం దేవస్థానానికి వచ్చిన దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్‌ను శానిటరీ సిబ్బంది కలసి తమ జీతాలు చెల్లింపుపై వినతిపత్రం సమర్పించారు. రెండు, మూడు రోజుల్లో జీతాలు చెల్లించే ఏర్పాటు చేయిస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు. నెలకు రూ.59 లక్షల చొప్పున 350 మంది సిబ్బందికి రెండు నెలల జీతాలు చెల్లించాల్సి ఉంది. అయినా 11వ తేదీ వచ్చినా జీతాలు చేతికి అందడం కాదు కదా ఇంకా జీతాల బిల్లు సిద్ధం కాలేదని తెలిసింది.
మరో వారం పడుతుందా?
జీతాలు బిల్లు తయారైతే అది ఆడిట్‌కు వెళ్లి అక్కడ ఏ కొర్రీలు పడకుండా మళ్లీ దేవస్థానానికి వచ్చి ఆ తరువాత బిల్లు పాస్ అవ్వాలి. ఆ బిల్లుపై చెక్కు తయారు చేస్తే దానిపై ఈఓ సంతకం చేసి సంబంధిత మొత్తాన్ని ఆన్‌లైన్‌లో కాంట్రాక్టర్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తే ఆ కాంట్రాక్టర్ 350 మంది సిబ్బంది అకౌంట్లలో జమ చేయాలి. ఇదంతా జరగడానికి కనీసం వారం నుంచి పది రోజుల సమయం పడుతుంది. అంటే ఆగస్టు 20 తేదీ తరువాతనే పారిశుధ్య కార్మికులకు జీతాలు అందే అవకాశం ఉందని అర్థమవుతోంది.