
మాజీ మంత్రి వనితపై అనుచిత వ్యాఖ్యలు తగవు
● వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా
అధ్యక్షుడు వేణు
● చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): మాజీ హోం మంత్రి తానేటి వనితపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాలి వేణు డిమాండ్ చేశారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఈ ఘటనపై వినతిపత్రం ఇచ్చారు. అనంతరం రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ హోం శాఖా మంత్రి డాక్టర్ వనితపై నల్లజర్లకు చెందిన సవలం రామకృష్ణ, మద్దిపాటి మహేష్, దేవరపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నగ్గిన నాగేంద్ర ఫేస్ బుక్‌లో అనుచిత పోస్టులు పెడుతున్నారన్నారు. ఏకవచనంతో సంబోధిస్తూ, వ్యంగ్యంగా కించపరుస్తున్నారన్నారు. ఈ నెల 7వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో నల్లజర్ల గ్రామానికి చెందిన సవలం రామకృష్ణ ఆ పోస్టుని షేర్ చేశారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వం అక్రమాల
తొలి అడుగు వేసింది
నల్లజర్లకు చెందిన ముప్పిడి పెద్దిరాజు 20 సంవత్సరాలుగా రోడ్డు పక్కన షాపు ఏర్పాటు చేసుకొని కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకుని తన కుటుంబంతో జీవిస్తున్నాడన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ షాపు ఖాళీ చేయాలని రెవెన్యూ, పోలీసు అధికారులు పెద్దిరాజును బెదిరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. కూటమి ప్రభుత్వం మద్యం మాఫియా, ఇసుక మాఫియా, దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాల్లో తొలి అడుగులు వేస్తోందని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ముద్దాయి అని ఖైదీ అని విమర్శిస్తుంటారని ఆయన ఆ రెండింటికి తేడా తెలియదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నారని ఆయనను ముద్దాయి అనాలా ఖైదీ అనాలా అని ప్రశ్నించారు. ప్రతాప్ నేని వాసు, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి వాసంశెట్టి పరమేశ్వరరావు, అప్పారావు, మళ్లీ పూడి సలీం పాల్గొన్నారు