
157 అర్జీల స్వీకరణ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 157 అర్జీలను స్వీకరించారు. ఆనంతరం ఏపీ అమరావతి ఓపెన్ స్కూల్ (సార్వత్రిక పీఠం) ద్వారా జారీ చేసిన ఉత్తీర్ణత ధ్రువపత్రాన్ని కలెక్టర్ పి.ప్రశాంతి, తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామానికి చెందిన దివ్యాంగురాలు లావణ్య లక్ష్మికి అందజేశారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఇటీవల జరిగిన 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 500 మార్కులకు 345 మార్కులు 69 శాతంతో సాధించి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన లావణ్య లక్ష్మీని అభినందించారు. ఆమె చదువును కొనసాగించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఆమెకు ప్రభుత్వం ద్వారా ప్రతినెలా రూ.15,000 పెన్షన్ అందిస్తున్నట్లు వివరించారు.
పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 31 అర్జీలు
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 31 ఫిర్యాదులు రాగా, వీటిలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యల గురించి, చీటింగ్, కొట్లాట, ఇతర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ డి.నరసింహకిషోర్ తెలిపారు. అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) ఎన్.బి.ఎం మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ (క్రైమ్స్) ఎల్.అర్జున్‌తో కలసి ఆయన పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి కష్టాలను, బాధలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు.
టీసీఐఎల్‌తో
నన్నయకు ఒప్పందం
రాజానగరం: న్యూఢిల్లీలోని టీసీఐఎల్ కంపెనీతో ఆదికవి నన్నయ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన పత్రాలను వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం జరిగిన సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, టీసీఐఎల్ ప్రతినిధి ఆదిత్య సంతకాలు చేసి, వాటిని పరస్పరం మార్చుకున్నారు. వీసీ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్ష అభియాన్ (పీఎం ఉష) పథకంలో భాగంగా యూనివర్సిటీలో ఏర్పాటు చేసే ల్యాబ్స్, టెక్నాలజీ సపోర్టు కోసం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామన్నారు. కార్యక్రమంలో పీఎం ఉషా కోఆర్డినేటర్ డాక్టర్ కె.రమణేశ్వరి, ప్రాజెక్టు మానిటరింగ్ కమిటీ మెంబర్స్ ఆచార్య కేఎస్ రమేష్, ఆచార్య డి.జ్యోతిర్మయి, డాక్టర్ వి.పెర్సిస్, డాక్టర్ పి. విజయనిర్మల పాల్గొన్నారు.
జీజీహెచ్‌లో మత
కార్యకలాపాలపై నిషేధం
అధికారులు, సిబ్బందికి సర్క్యులర్ జారీ
కాకినాడ క్రైం: జీజీహెచ్‌లో ఎప్పటికప్పుడు తీవ్ర వివాదాలకు కారణమవుతున్న మత కార్యకలాపాలపై నిషేధాన్ని విధిస్తూ కలెక్టర్ షణ్మోహన్ సూచనలతో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆర్‌సీ.నం.18/ఏవో/2025తో సర్క్యులర్ జారీ చేశారు. అంతకుముందు హెడ్ నర్సులు, ఆసుపత్రి అధికారులతో సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో అంతర్గత సమావేశం నిర్వహించారు. రాజ్యాంగ సూత్రాలకు లోబడి లౌకికవాదం అనుసరించాల్సిన ఆసుపత్రి, ఆవరణలో, తటస్థత, సమగ్రత తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వార్డులు, కార్యాలయాలతో పాటు ఆసుపత్రి సంబంధిత ఇతర ప్రాంతాలలో మతపరమైన కార్యకలాపాలు అంటే పూజలు, ప్రార్థనలు, ఉత్సవాలు, సమావేశాలు, ఊరేగింపులు, ప్రచారాలు, బోధనలు నిర్వహించడం, ప్రోత్సహించడం, వాటిలో పాల్గొనడం పూర్తిగా నిషేధం. మత సంబంధిత పుస్తకాలు, కరపత్రాలు, బ్యానర్లు, చిత్రాలు, వాల్ పోస్టర్లు చూపడం, పంచడం చేయకూడదు.

157 అర్జీల స్వీకరణ

157 అర్జీల స్వీకరణ