
లెఫ్ట్ అయినా రైటే..
రాయవరం/బిక్కవోలు: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. అన్నాడో సినీ కవి. కుడి ఎడమైతే గ్రహపాటు కాదోయ్ అంటున్నారు లెఫ్ట్ హ్యాండర్స్. మానవ శరీరంలో గుండె ఎడమ వైపు ఉంటుంది. ఎడమ చేతితో రాసేవారు తమ హదయ స్పందనను కచ్చితంగా అక్షర బద్ధం చేయగలరని ప్రముఖ విద్యా, మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ వ్యాఖ్యానించారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. ప్రపంచంలో ఉన్నత పదవులు అలంకరించిన వారిలో సగానికి పైగా ఎడమ చేతి వాటం వారే. బుధవారం ప్రపంచ లెఫ్ట్ హ్యాండర్స్ డే సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.
భిన్నమైన శైలి
సాధారణంగా ఏ పనైనా కుడి చేత్తో చేయడం అలవాటు. ప్రపంచంలో 87 శాతం మంది కుడి చేత్తో పనులు చేస్తుంటే, 12 శాతం మంది ఎడమ చేత్తో చేస్తారని సర్వేల్లో వెల్లడైంది. మిగిలిన ఒక శాతం మంది రెండు చేతులను వినియోగించడంలో సామర్థ్యాన్ని కనబరుస్తారు. దేశంలో 5.20 శాతం మంది మాత్రమే ఎడమ చేతి వాటం కలిగి ఉన్నారు. కుడిచేతి వాటం వారి కన్నా, ఎడమ చేతి వాటం వారు ప్రత్యేక స్థానాల్లో ఉంటారని, వారి మేధోశక్తి, ఆలోచనలు, తెలివితేటలు భిన్నంగా ఉంటాయని నిపుణుల అంచనా. ప్రస్తుతం ప్రపంచంలో గుర్తింపు పొందిన మేధావుల్లో చాలా మంది ఎడమ చేతి వాటం వారు కావడం విశేషం. ప్రతిభ, సృజనాత్మకత, ఏ రంగంలోనైనా రాణించే శక్తి సామర్థ్యాలు ఎడమ చేతి వాటం వారిలోనే ఎక్కువని నాడీ శాస్త్రం కూడా చెబుతుందంటారు. జిల్లా జనాభాలో సుమారు 3.01 లక్షల మంది ఎడమ చేతి వాటం వారున్నట్టు ఓ అంచనా.
ప్రముఖుల్లో కొందరు
ప్రముఖ తత్వవేత్త అరిస్టాటిల్, చంద్రుడిపై మొట్టమొదట కాలుమోపిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, మోనాలిసా సృష్టికర్త లియోనార్డో డావెన్సీ, అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్‌క్లింటన్, ప్రధాని నరేంద్రమోదీ, పారిశ్రామికవేత్త రతన్‌టాటా, మాజీ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, యువరాజ్‌సింగ్, సినీ నటుల్లో అమితాబ్ బచ్చన్, సావిత్రి ఇలా ఎడమచేతి వాటమున్న ప్రముఖులే. అలాగే పలువురు కళా, క్రీడా, సంగీత రంగాల్లో రాణిస్తూ లెఫ్ట్.. బట్ వియ్ ఆల్వేస్ రైట్ అనిపించుకుంటున్నారు.
ఇబ్బందులూ తప్పవు!
ఎడమ చేతి వాడకంపై లాభనష్టాలు, ఇబ్బందులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎడమచేతి వాటం ఉన్న వారెంతో అదృష్టవంతులని కొందరంటుంటారు. అటువంటి వారు ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తులుగా ఎదిగారని చెబుతారు. శుభకార్యాల్లో ఎడమ చేతి వినియోగాన్ని మన సంప్రదాయాలు అంగీకరించవు. ఇటువంటి సందర్భాల్లో ఆ అలవాటు ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూజలు, శుభకార్యాలు, డబ్బు చేతులు మారేటప్పుడు కుడి చేతినే ఉపయోగిస్తారు. పాఠశాలల్లో విద్యార్థుల కుర్చీలకు కుడిచేతివైపు రాయడానికి వీలుగా అట్టలు అమరుస్తారు. డ్రైవర్లకు కుడిచేతి వాటానికి అనుకూలంగా హారన్ వంటివి ఉంటాయి.
జన్యు ప్రభావం కూడా..
పుట్టినప్పటి నుంచే కుడి, ఎడమ చేతి వాటాలను సహజసిద్ధంగా కలిగి ఉంటారని సైన్స్ చెబుతోంది. మనిషికి మెదడు కుడి, ఎడమ రెండు అర్ధ భాగాలుగా ఉంటుంది. కుడి వైపు శరీర భాగాన్ని మెదడు ఎడమ వైపు భాగం నియంత్రిస్తుందని, మెదడు కుడి అర్ధ భాగం బలంగా ఉన్న వారిలో ఎడమ చేతి వాటం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఎడమ చేతి వాటం గమనిస్తే.. దానిని మాన్పించేందుకు యత్నిస్తుంటారు. జన్యుపరమైన మార్పులు ఉన్నప్పుడు అలా మాన్పించడం సాధ్యం కాదంటున్నారు.
ఎడమ చేతి వాటం జాబితాలో
ఎందరో ప్రముఖులు
కళా, క్రీడా, సంగీత,
రాజకీయ రంగాల్లో అద్భుత రాణింపు
రేపు లెఫ్ట్ హ్యాండర్స్ డే