
సుఖీభవ కొందరికే..
ప్రభుత్వ సాయం అందకున్నా..
సాగు తప్పదుగా..
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి పాలనలో తమకు అడుగడుగునా అన్యాయమే జరుగుతోందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నుంచి నగదు జమ అయ్యే వరకూ వారికి అవస్థలు తప్పడం లేదు. ఈ పథకం కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని సార్వత్రిక ఎన్నికల సమయంలో చెప్పిన కూటమి నేతలు అమలుకు వచ్చేసరికి అనేక సాకులతో కోతలు పెట్టారు. తొలి ఏడాది సుమారు రూ.160.98 కోట్ల మేర సాయం ఎగ్గొట్టారు. ఏడాది తర్వాత ఎట్టకేలకు ఈ పథకం అమలు చేసినా అందులోనూ అన్యాయమే జరిగిందని చాలా మంది రైతులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2 వేలతో కలిపి ఇటీవల ఒక్కో రైతుకు రూ.7 వేలు జమ చేశామంటూ హడావుడి చేశారు. అయితే, ఈ సొమ్ము తమ ఖాతాలకు సక్రమంగా జమ కాలేదంటూ క్షేత్ర స్థాయిలో పలువురు రైతులు చెబుతున్నారు. వివిధ కారణాలు చూపి జిల్లావ్యాప్తంగా సుమారు 28 వేల మంది రైతులకు ఈ పథకం డబ్బులు జమ చేయలేదు.
వేలాది మందికి మొండిచేయి
అన్నదాత సుఖీభవ కింద జిల్లావ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రూ.78.25 కోట్లు జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. తొలి విడతగా అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం 1,14,991 మంది రైతులకు రూ.5 వేల చొప్పున రూ.57.49 కోట్లు, పీఎం కిసాన్ సమ్మాన్ కింద కేంద్ర ప్రభుత్వం 1,03,838 మందికి రూ.2 వేల చొప్పున రూ.20.76 కోట్ల మేర లబ్ధి చేకూరుస్తున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. అయితే, వేలాది మంది రైతులు తమకు నగదు జమ కాలేదని చెబుతున్నారు. ఏడాది తర్వాత అమలు చేసిన ఈ పథకంలో ఏకంగా 28 వేల మందికి నగదు సాయం అందలేదు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే అనేక కారణాలు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. ఆధార్ నంబర్ సక్రమంగా లేదని, బ్యాంక్ ఖాతా మారిందని ఇలా రకరకాల కారణాలతో నగదు జమను నిలిపివేశారు.
సాంకేతిక సమస్యలా..!
వాస్తవానికి పథకం అమలుకు ముందుగానే అధికారులు అన్ని అంశాలనూ పరిశీలించారు. ఈ–కేవైసీ ప్రక్రియ సైతం పూర్తి చేశారు. ఈ క్రమంలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సాంకేతిక పొరపాట్లను ఎందుకు పసిగట్టలేకపోయారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ విభాగానికి సంబంధించిన సాంకేతిక సమస్యలే ఇందులో అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని పరిష్కరించడంలో ఆ శాఖ అధికారులు విఫలమయ్యారు. ఫలితంగానే ఏకంగా 28 వేల మంది రైతులకు సుఖీభవ డబ్బులు పడలేదని చెబుతున్నారు. ఒకవేళ అంతా సక్రమంగానే ఉందని అనుకున్నా.. కేంద్రం విడుదల చేసిన పీఎం కిసాన్ నిధులు జమ అయ్యి.. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.5 వేలు ఎందుకు జమ కాలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సాంకేతిక సమస్యలుంటే పీఎం కిసాన్ నిధులు కూడా జమ కాకూడదు కదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ–కేవైసీ చేసే సమయంలో అధికారులు, సిబ్బంది ఆధార్ మిస్ మ్యాచింగ్, మనుగడలో లేని బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించారు. భూ యజమాని మృతి చెందితే ఈ–కేవైసీ ఏవిధంగా చేశారనే ప్రశ్న తలెత్తుతోంది. కొందరి ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నగదు జమయినట్లు సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు కూడా వచ్చాయి. తీరా బ్యాంకుకు వెళ్లి చూస్తే.. కేవలం పీఎం కిసాన్ రూ.2 వేలు మాత్రమే జమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.5 వేలు జమ కాలేదు. దీంతో ఆయా రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో తమకు ఇటువంటి దురవస్థలు కల్పించిన ప్రభుత్వాన్ని వారు దుయ్యబడుతున్నారు.
అనర్హత పేరిట కోతలు
అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వం భారీగా కోతలు విధించింది. గత ఏడాదితో పోలిస్తే.. ప్రస్తుతం 19,502 మందిని ఈ పథకానికి దూరం చే సింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏటా సగటున 1,33,502 మంది ఖాతాల్లో రైతుభరోసా నిధులు నేరుగా జమ చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ సంఖ్యను 1,14,000కు కుదించింది. డి–పట్టాలు, అసైన్డ్ భూములు, ఈనాం భూములు ఉన్న రైతులకు ఈ పథకం అందలేదు. దేవదాయ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు, కౌ లు రైతులతో పాటు ఏడాదికి రెండుసార్లు సాయం అందిస్తామని ప్రకటించారు. అది కూడా నెరవేరిన దాఖలాల్లేవు.
కొంత మందికి పీఎం కిసాన్
రూ.2 వేలు మాత్రమే జమ
రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.5 వేలు
కూడా జమ అయినట్టు మెసేజ్‌లు
అకౌంట్లో మాత్రం కనిపించని నగదు
అయోమయంలో రైతులు
27,397 మందికి పైగా
లబ్ధిదారులకు జమ కాని నగదు
నియోజకవర్గాల వారీగా పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల వివరాలు
నియోజకవర్గం పీఎం కిసాన్ సుఖీభవ
అనపర్తి 16,007 17,595
రాజమండ్రి రూరల్ 5,754 5,730
రాజమండ్రి అర్బన్ 81 0
రాజానగరం 23,583 26,227
జగ్గంపేట 5,951 7,705
(గోకవరం మండలం)
గోపాలపురం 21,256 23,482
కొవ్వూరు 14,272 14,884
నిడదవోలు 16,930 19,368

సుఖీభవ కొందరికే..