సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వంలో కీలకమైన సామాజిక వర్గానికే పెద్దపీట లభిస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు మొదలుకుని నామినేటెడ్ పదవుల్లో సైతం వాళ్లకే ప్రాధాన్యం దక్కుతోంది. తాజాగా భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టుల్లోనూ వారి హవా కొనసాగింది. ఇకపై కేటాయించే పదవుల్లో తామే సత్తా చాటుతామంటూ ఆ సామాజిక వర్గం నేతలు బహిరంగ ప్రకటనలు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర సామాజిక వర్గం నేతలు కూటమి ప్రభుత్వానికి కనపడరా..? అంటూ పలువురు ఆవేదన చెందుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో అగ్ర తాంబూలం
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకే పట్టం గట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తులో సీట్ల కేటాయింపు మొదలుకుని నామినేటెడ్ పదవుల భర్తీలోనూ అదే పంథా కొనసాగింది.
ఎన్నికల్లో రాజమహేంద్రవరం ఎంపీ సీటు దగ్గుబాటి పురందేశ్వరికి, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే స్థానం గోరంట్ల బుచ్చయ్యచౌదరికి కేటాయించారు. ఈ రెండు స్థానాలు అప్పట్లో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆశించారు. ఎంపీ టికెట్ బీజేపీ నేత సోము వీర్రాజు ఆశించగా.. రూరల్ ఎమ్మెల్యే స్థానం కందుల దుర్గేష్‌కు దాదాపు ఖాయమన్న భావన వ్యక్తమైంది. అనంతరం బుచ్చయ్య చౌదరికి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం, దుర్గేష్ నిడదవోలులో సరిపెట్టుకోవడం జరిగిపోయాయి.
నామినేటెడ్ పదవుల్లో సైతం
కూటమి ప్రభుత్వం భర్తీ చేసిన నామినేటెడ్ పదవుల్లోనూ అదే సామాజిక వర్గానికి చెందిన నేతలకు పెద్దపీట వేశారు. రాజానగరం ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడ్డ బొడ్డు వెంకటరమణ చౌదరికి రుడా చైర్మన్‌గా టీడీపీ అవకాశం కల్పించింది. టీటీడీ బోర్డు మెంబర్‌గా అక్కిన ముని కోటేశ్వరరావును ఎంపిక చేసింది. తాజాగా ప్రకటించిన రాజమహేంద్రవరం మార్కెట్ కమిటీ చైర్మన్ వాసుకు కేటాయించారు. కొవ్వూరు ఏఎంసీ చైర్మన్‌గా నాదెండ్ల శ్రీరామ్‌ను నియమించారు. ఇక్కడ మాజీ మంత్రి జవహర్ వర్గాన్ని విస్మరించి మరీ కమ్మ సామాజికవర్గానికి కట్టబెట్టారు. ఈ పదవులపై కాపు, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఆశలు పెట్టుకున్నారు. కాపు, బీసీ నేతలకు కేటాయిస్తారన్న ప్రచారం విస్తృతంగా నడిచింది. చివరకు ఆ సామాజిక వర్గానికి పట్టం కట్టడంతో కాపు, బీసీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఈ అంశం మింగుడుపడటం లేదు. పార్టీ కోసం ఐదేళ్లుగా కష్టపడితే తమకు దక్కే గౌరవం ఇదేనా..? అంటూ ఆవేదన చెందుతున్నారు. అంతేగాక మార్కెట్ కమిటీ డైరెక్టర్ స్థానాల్లో సింహభాగం వారినే కూర్చోబెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సామాజిక వర్గానికి జిల్లాలో తక్కువ ప్రాబల్యం, ఓట్లు ఉన్నా.. అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. కేవలం సీఎం చంద్రబాబునాయుడు సామాజికవర్గం కావడంతోనే అన్ని పదవులూ వాళ్లకే కట్టబెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సీఎం ప్రోగ్రాం కన్వీనర్ సైతం అదే వర్గం
అత్యంత కీలకమైన సీఎం ప్రోగ్రాం కన్వీనర్ పోస్టు సైతం అదే సామాజిక వర్గానికి దక్కింది. రాజానగరం నియోజకవర్గానికి చెందిన పెందుర్తి వెంకటేష్‌ను ఈ పదవి వరించింది.
మేయరైనా దక్కేనా..?
రాజమహేంద్రవరం కార్పొరేషన్‌కు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఆ శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేయడంతో ఎన్నికల కోసం పలువురు నేతలు నిరీక్షిస్తున్నారు. ఎన్నికలు జరిగి పాలకవర్గం ఏర్పడితే మేయర్ పీఠం తామే దక్కించుకోవాలని ఆ వర్గం నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత గన్నికృష్ణ ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు. మేయర్ తనకే దక్కుతుందని, అధిష్టానం సానుకూలత వ్యక్తం చేసిందంటూ ప్రచారం చేస్తున్నారు. ఎలాగైనా తాను దక్కించుకుని తీరతానంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటనలు గుప్పించారు. ఆయనతో పాటు మరో టీడీపీ సీనియర్ నేత యర్రా వేణుగోపాలరాయుడు సైతం మేయర్ సీటు ఆశిస్తున్నారు. అంతేగాక ప్రముఖ ఆలయాల ట్రస్ట్‌బోర్డు చైర్మన్, డైరెక్టర్ పదవులకు కమ్మ సామాజిక వర్గం నుంచి గట్టి పోటీ నెలకొంది.
కొవ్వూరులో వాళ్లదే పెత్తనం
కొవ్వూరు నియోజకవర్గంలో బాబు సామాజిక వర్గానికి చెందిన నేతలదే పెత్తనం. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నా.. అన్నీ పెండ్యాల అచ్చిబాబు చెప్పినట్లే జరుగుతోందన్న ఆరోపణలున్నాయి.
సార్వత్రిక ఎన్నికల సమయంలో కొవ్వూరు స్థానం మాజీ మంత్రి జవహర్‌కు తప్ప ఇతరులకు ఎవరికి ఇచ్చినా.. తమకు ఓకే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, అందుకు సీఎం చంద్రబాబు స్పందించడం, గోపాలపురం నియోజకవర్గానికి చెందిన ముప్పిడి వెంకటేశ్వరరావుకు కొవ్వూరు ఎమ్మెల్యే స్థానం కేటాయించడం వెనుక అచ్చిబాబే ఉండటాన్ని బట్టి చూస్తే తమ సామాజిక వర్గ నేతలకు కూటమి ప్రభుత్వంలో ఏ మేరకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న విషయం అర్థం అవుతోంది.
జిల్లాలో కమ్మ సామాజిక వర్గం
నేతలకే అందలం
ఎంపీ, ఎమ్మెల్యే,
చైర్మన్ పదవులు వారికే..
తాజాగా మార్కెట్ కమిటీ పదవీ
అదే వర్గానికి..
రాజమహేంద్రవరం మేయర్‌పై కన్ను
ఏకపక్ష ధోరణులపై మిగిలిన
సామాజిక వర్గ నేతల గుర్రు
‘అత్తి’కి భంగపాటేనా?
రాజమహేంద్రవరం మేయర్ పదవినీ కూడా కమ్మ సామాజికి వర్గానికి కేటాయిస్తే జనసేన ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోలేకపోయిన అత్తి సత్యనారాయణకు మరోసారి భంగపాటు తప్పదన్న భావన ఉంది. సిటీ టికెట్ త్యాగం చేసిన అత్తి సత్యనారాయణకు మేయర్‌గా అవకాశం కల్పిస్తామని టీడీపీ, జనసేన అధిష్టానాల నుంచి హామీ లభించిన విషయం తెలిసిందే. జిల్లాలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే అత్తికి ఆశాభంగం తప్పదా..? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
నామినేటెడ్ రుబాబు!
నామినేటెడ్ రుబాబు!
నామినేటెడ్ రుబాబు!
నామినేటెడ్ రుబాబు!


