ఆరుగురు వ్రత పురోహితుల సస్పెన్షన్
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వ్రతవిభాగంలో పనిచేస్తున్న ఆరుగురు వ్రత పురోహితులను సస్పెండ్ చేస్తూ దేవస్థానం ఈఓ వీ త్రినాధరావు సోమవారం ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం అన్నవరం దేవస్థానం సామూహిక సత్యదేవుని వ్రతాలు నిర్వహించింది. ఇందుకు ఆరుగురు రెగ్యులర్ వ్రత పురోహితులు, ముగ్గురు అదనపు పురోహితులు, వ్రత సామగ్రి, సత్యదేవుని ప్రచార రథంతో బయల్దేరి వెళ్లారు. ఈ వ్రతాలలో 300 జంటలు పాల్గొనగా మరో వేయి మంది భక్తులు తిలకించినట్టు అధికారులు తెలిపారు. ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు వ్రతాలు నిర్వహించిన అనంతరం వ్రతకథ చెప్పిన మొదటి శ్రేణి వ్రతపురోహితుడు మల్లాది గురుమూర్తి వ్రత దక్షిణగా భక్తులు వస్త్రదానం కింద రూ.501, అన్నదానం కింద రూ.251 ఇవ్వాలని మైకు ద్వారా డిమాండ్ చేసినట్టు దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్‌లాల్, కమిషనర్ కే రామచంద్రమోహన్‌లకు సంబంధిత వీడియోలను సాక్ష్యాలుగా చూపుతూ కొందరు ఫిర్యాదు చేశారు. వాటిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఈఓ త్రినాథ్‌రావును ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ఆదేశించారు. దీనిపై ఈఓ ఆ వ్రతాల నిర్వహణకు వెళ్లిన గుమస్తా బీఎస్‌ఎన్ రాజును విచారించగా వ్రతాలనంతరం భక్తుల నుంచి దానాలు రూపంలో కానుకలు డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని, తాను వారించినా వినలేదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీని ఆధారంగా స్పెషల్ గ్రేడ్ వ్రత పురోహితులు మంధా శ్రీరామ్మూర్తి, ప్రయాగ ఆంజనేయులు, తొయ్యేటి వేంకట నరసింహ హరిహర సుబ్రహ్మణ్యం, మొదటి శ్రేణి పురోహితులు మల్లాది గురుమూర్తి, పాలంకి సోమేశ్వరరావు, మూడో గ్రేడ్ పురోహితుడు మొక్కరాల సతీష్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. గుమస్తా బీఎస్‌ఎన్ రాజుకు మెమో ఇచ్చారు. ఈ వ్రత పురోహితులు కొందరు గతంలో ఇదే విధమైన ఆరోపణలతో సస్పెండ్ అయి మళ్లీ విధుల్లోకి వచ్చారు. దేవస్థానంలో పరిస్థితులు చక్కదిద్దడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


