చెడు అలవాట్లతో బీబీఏ విద్యార
అమలాపురం టౌన్: అమలాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ఎదురుగా గల మెట్ల కాలనీకి చెందిన బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కొప్పన దీపక్ రాజన్ (18) ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో ఫ్యాన్ హుక్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమలాపురం రూరల్ మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో బీబీఏ చదువుతున్న దీపక్ రాజన్ చెడు అలవాట్లకు బానిసై ఈ అఘాయిత్యం చేసుకున్నాడని పట్టణ ఎస్సై టి.శ్రీనివాస్ తెలిపారు. తండ్రి మరణించడంతో అతని తల్లి అతి గారాబంగా పెంచింది. తరచూ డబ్బు కోసం తల్లిని బెదిరించడం, ఇచ్చిన డబ్బుతో మద్యం తాగడం అతనికి అలవాటుగా మారింది. కాకినాడకు చెందిన తన మామయ్య ఇటీవల చనిపోవడంతో అతని తల్లి అక్కడికి వెళ్లింది. ఆదివారం అర్ధరాత్రి మద్యం సేవించి ఇంటికి చేరుకున్న దీపక్ రాజన్ తన తండ్రి గతంలో చనిపోయాడు, ఇప్పుడు మామయ్య చనిపోయాడు. నేనూ చనిపోతానని ఇంట్లో ఉన్న తన తాతాయ్యకు చెప్పి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. గంట సమయం దాటాక అనుమానం వచ్చి తాతాయ్య చూసేసరికి గదిలో దీపక్ రాజన్ ఉరి వేసుకుని వేలాడుతుండడాన్ని గమనించాడు. పోస్టుమార్టం కోసం విద్యార్థి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. పట్టణ సీఐ పి.వీరబాబు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.


