ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రభుత్వ స్థలాల్లో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి, పక్కా ఇల్లు నిర్మించాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద సోమవారం ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, ఏఐఎఫ్టీయూ, ప్రగతిశీల మహిళా సంఘం ( సీ్త్ర విముక్తి), ప్రజా సంఘాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం జాయింట్ కలెక్టర్ అపూర్వభరత్‌కు వినతి పత్రం సమర్పించారు. ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ పెద్దాపురం ఒకటో వార్డు పరిధిలో గల ప్రభుత్వ స్థలంలో 30 ఏళ్ల క్రితం ఇల్లు లేని నిరుపేదలు పూరిగుడిసెలు వేసుకుని నివాసముంటున్నారన్నారు. ఆ కాలనీలో మౌలిక వసతులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వరదలు వచ్చిన, ఏలూరు కాలువ నీరు వదిలిన ఆ కాలనీ ముంపుకు గురవుతుందన్నారు. సర్వే నంబర్ 579లో గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారులకు ఇంటి రుణాలు మంజూరు చేయాలని, వారికి రోడ్లు డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.300 మంది శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు శ్మశాన వాటిక లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి శ్మశాన వాటికకు స్థలం కొనుగోలు చేసి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి అధ్యక్షుడు వల్లూరి రాజబాబు, సహాయ కార్యదర్శి కడితి సతీష్, జిల్లా నాయకులు కే రామలింగేశ్వర రావు, ఎల్లే సత్తిబాబు ఏఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి కుంచ అంజిబాబు, అధ్యక్షుడు మడికి సత్యం, ప్రగతిశీల మహిళా సంఘం ( సీ్త్ర విముక్తి) నాయకులు రెడ్డి దుర్గాదేవి, యమునా, శిరీష, దమ్మ సీత పాల్గొన్నారు.


