ఉప్పాడలో ఫుడ్ పాయిజన్
● ఎనిమిది మంది మత్స్యకారులకు అస్వస్థత
● పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో
వైద్య సేవలు పొందుతున్న బాధితులు
పిఠాపురం: చేపల ప్యాకింగ్ పనికి వెళ్లిన కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు ఫుడ్ పాయిజన్ అయిన బిర్యాని తినడంతో సోమవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని పిఠాపురం ప్రభుత్వాసునత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైదద్యులు తెలిపారు. బాధితుల కథనం ప్రకారం కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన మత్స్యకారులు వంక కాలేబు, ఓసిపల్లి సంతోష్, పల్లెటి స్టాలిన్, ఉమ్మిడి జాన్, గోశల పీటర్ పాల్, రాచపల్లి ప్రసాద్, గోశల ప్రసాద్, కోడా నాగేంద్ర ఆదివారం తాళ్లరేవు మండలం భైరవపాలెం తీర ప్రాంతానికి చేపల ప్యాకింగ్ పనికి వెళ్లారు. తాళ్లరేవులో ఒక బిర్యానీ హోటల్ వద్ద ఎనిమిది మంది బిర్యానీ కొనుక్కుని ప్యాకింగ్ పూర్తయ్యాక దానిని తిన్నారు. తిరిగి రాత్రికి ఇంటికి చేరుకున్నాక బిర్యానీ తిన్న ఎనిమిది మందికి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి రావడంతో వారందరిని కొత్తపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఇద్దరికి మినహా మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
బాధితులను పరామర్శించిన మాజీ ఎంపీ గీత
ఫుడ్ పాయిజన్ అవ్వడంతో అస్వస్థతకు గురైన బాధితులను మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యురాలు వంగా గీతావిశ్వనాఽథ్ పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు అంతా అండగా ఉంటామని ఆమె బాధితులకు ఽభరోసా కల్పించారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయాలని అవసరమైన సహకారం అందించాలని పిఠాపురం, కొత్తపల్లి మండల పార్టీ అధ్యక్షులు రావుల మాధవరావు, ఆనాల సుదర్శన్‌లకు ఆమె సూచించారు. ఆమె వెంట మత్స్యకార నాయకుడు ఉప్పాడ ఎంపీటీసీ మేరుగు ఎల్లాజీ కొత్తెం దత్తుడు తదితరులు ఉన్నారు.


