గ్రావెల్ అక్రమ తవ్వకాలపై అధికారుల దాడులు
రెండు పొక్లెయిన్లు, లారీ సీజ్
గోకవరం: మండలంలోని రంపయర్రంపాలెం, గంగంపాలెం గ్రామాల్లో జరుగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలపై జిల్లా మైన్స్‌శాఖ అధికారి డి.ఫణిభూషణ్‌రెడ్డి సోమవారం దాడులు నిర్వహించారు. రంపయర్రంపాలెంలో సర్వే నంబర్ 471లో బి.అర్జునుడికి చెందిన భూమిలో, గంగంపాలెంలో సర్వేనంబర్ 96/2లో కనిశెట్టి అచ్చియ్యమ్మకు చెందిన భూమిలో గ్రావెల్ అక్రమంగా తవ్వుతున్నట్టు ఆయన గుర్తించారు. ఆయా భూముల్లో గ్రావెల్ తవ్వకాలు నిర్వహిస్తున్న రెండు జేసీబీలను, లారీని సీజ్ చేశారు. రంపయర్రంపాలెంలో 1,104 క్యూబిక్ మీటర్లు, గంగంపాలెంలో 5,769 క్యూబిక్ మీటర్లు మేర గ్రావెల్ అక్రమంగా తవ్వినట్టు నిర్ధారించామన్నారు. ఆయన వెంట మైన్స్‌శాఖ సర్వేయర్ పి.శ్రీనివాస్, ఆయా గ్రామాల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
అనుమానాస్పద స్థితిలో
బాలిక మృతి
తొండంగి: మండలంలోని ఏ.వి.నగరంలో బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై అనుమానాస్పద స్థితిలో మృతి కేసు నమోదు చేసినట్టు తొండంగి ఎస్సై జగన్మోహన్‌రావు సోమవారం తెలిపారు. ఏ.వి.నగరం గ్రామానికి చెందిన నరాల పాపారావుకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె కత్తిపూడిలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆదివారం ఏ.వి.నగరం గ్రామంలోని తన ఇంటి నుంచి అదే గ్రామంలో అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఇంటి దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని అదే గ్రామానికి చెందిన తాటిపర్తి వసంతు పాపారావు సమాచారం అందించాడు. ఘటనా స్ధలానికి వెళ్లి చూడగా కుమార్తె ఉరివేసుకుని వేలాడుతూ మృతిచెంది ఉంది. కుమార్తె మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ పాపారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు.
బైక్ దొంగలకు 12 నెలల జైలు
గండేపల్లి: బైక్ దొంగలకు కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించినట్టు సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. రాజమహేంద్రవరానికి చెందిన తోట వినయ్ (లోఫర్), ఐసెట్టి దివాకర్ (బన్నీ) కలిసి మండలంలోని సూరంపాలెంకు చెందిన వెలుగుల బాలాజీ జూలై 11న తన కూతురిని స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు కాలేజీలో దింపేందుకు వెళ్లి మోటార్ సైకిల్‌ను పార్క్‌చేసి కాలేజీలోకి వెళ్లి వచ్చే సరికి బైక్ మాయమైందన్నారు. ఎసై యూవి శివ నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి బైక్ చోరీకి పాల్పడిన ఇద్దరిని అరెస్ట్‌చేసి కోర్టుకు తరలించగా పెద్దాపురం జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎల్ దేవి రత్నకుమారి ఒక్కొక్కరికి 12 నెలలు చొప్పున జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించినట్టు తెలిపారు.


