కంద పంటకు ఇదే అనువైన కాలం | - | Sakshi
Sakshi News home page

కంద పంటకు ఇదే అనువైన కాలం

Dec 23 2025 7:16 AM | Updated on Dec 23 2025 7:16 AM

కంద ప

కంద పంటకు ఇదే అనువైన కాలం

పెరవలి: రాష్ట్రంలో కంద పంటను పశ్చిమ, తూర్పుగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో 10వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పెరవలి, నిడదవోలు, కొవ్వూరు, నల్లజర్ల, ఉండ్రాజవరం, చాగల్లు మండలాల్లో సుమారు 400 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. కంద పంట వేసే రైతులకు ఇదే సరైన సమయం కావడంతో రైతులు కందను నాటే విధానం, సాగు, సస్యరక్షణ చర్యలు, ఎరువుల యాజమాన్యం, ఆశించే తెగుళ్లు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొవ్వూరు ఉద్యావన శాఖ అధికారి డి.సుధీర్‌ కుమార్‌ వివరించారు. కంద నాటే సమయం ఆసన్నమవ్వడంతో రైతులు ఈ విధంగా సాగు చేపట్టాలని సూచించారు.

నేల తయారీ

నీటి వసతి కలిగి నీరు బయటకుపోయే సదుపాయం గల సారవంతమైన నేలలను ఎన్నుకోవాలి. ఈ పంట వేయడానికి దుక్కు లోతుగా దున్నాలి. ఆఖరి దుక్కులో 10 టన్నుల చివికిన పశువుల ఎరువును, 24కిలోల భాస్వరం ఎరువులను వేసి దుక్కి దున్నాలి.

నాటే సమయం

ఏడాదిలో రెండుసార్లు ఈ పంటను వేయవచ్చు. మే, జూన్‌ నెలల్లోను నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో విత్తనాన్ని నాటవచ్చు.

విత్తనం

నీడలో రెండుమూడు నెలలు ఆరబెట్టిన దుంపలనే విత్తనంగా ఉపయోగించాలి. విత్తన దుంపలు 500 నుండి 750గ్రాములు బరువు కలిగినవి వినియోగిస్తే వీటిని ముక్కలుగా కోసి వాడవచ్చు. ముక్కలుగా కోసేటప్పుడు దుంపకన్ను(మొలక భాగం) ప్రతీ ముక్కలోకి వచ్చే విధంగా కోయాలి. విత్తన దుంపలను కోసిన తరువాత వెంటనే నాటాలి. ఎకరానికి 6టన్నుల విత్తనం వాడాలి.

నాటడం

విత్తనదుంపలను 60 సెంటీమీటర్ల దూరంలో నాటాలి. దుంపలను భూమికి లోతుగా నాటి వెంటనే తడిపెట్టాలి.

ఎరువుల యాజమాన్యం

విత్తనం నాటిన 40, 80, 120 రోజులకు ఎరువులను వేయాలి. నత్రజని, పొటాష్‌, యూరియాను 217 కిలోలు, మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ 179 కిలోలను 3 సమాన భాగాలుగా చేసి పైన తెలిపిన రోజుల్లో అందించాలి.

ఇనుప ధాతువు లోపం

కంద పంటకు నీటితడులు సక్రమంగా ఇవ్వని చేలల్లో ఇనుపధాతువు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ధాతువు లోపం ఉన్న మొక్కల ఆకులు పత్రహరితం కోల్పోయి తెలుపుగా మారతాయి. దీని నివారణకు లీటరు నీటికి 5 గ్రాముల అన్నబేధి, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

జింక్‌ ధాతువు లోపం

జింక్‌ ధాతువు లోపం ఉంటే కందమొక్కల ఆకుల ఈనెల మధ్య పసుపువర్ణంగా మారి ఆకు ముగ్గిపోయి ఎండిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల జింక్‌సల్ఫేట్‌ కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

ఆకుమచ్చ తెగులు

ఆకులపై చిన్నచిన్న మచ్చలు ఏర్పడి అవి పెరిగి ఆకంతా వ్యాపించి ఆకులు ఎండిపోతాయి. ఈ తెగులు సోకడం వలన పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ మందును పిచికారీ చేయాలి.

కాండం లేక మొదలు కుళ్లు తెగులు

ఈ తెగులు మొక్క మొదలు వద్ద కాండాన్ని ఆశించడంతో కాండం కుళ్లిపోయి చనిపోతుంది. ఈ తెగులు ఆశించినప్పుడు మొదలుకు నీరు వెళ్ళకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల కాప్టాన్‌ లేదా 3 గ్రాముల కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ మందును కలిపి కాండం మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి.

మొజాయిక్‌ తెగులు

ఇది వైరస్‌ తెగులు. ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులు పత్రహరితం కోల్పోయి ఆకులపై తెలుపు, పసుపురంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు చిన్నవిగాను, ముడుచుకుపోయినట్లుగా ఉంటాయి. ఈ తెగులు విత్తన దుంపల ద్వారాను, పేనుబంక పురుగు ద్వారాను వ్యాపిస్తుంది. దీని నివారణకు డైమిథోయేట్‌ లేదా మిథైల్‌డెమటాన్‌ మందును 2 మిల్లీలీటర్లు 1 లీటరు నీటిలో కలిపి ఆకులు పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి.

అన్నవరప్పాడులో చేలో పరచిన విత్తనం కంద

అన్నవరప్పాడులో విత్తనం కందను నాటుతున్న కూలీలు

కంద పంటకు ఇదే అనువైన కాలం1
1/3

కంద పంటకు ఇదే అనువైన కాలం

కంద పంటకు ఇదే అనువైన కాలం2
2/3

కంద పంటకు ఇదే అనువైన కాలం

కంద పంటకు ఇదే అనువైన కాలం3
3/3

కంద పంటకు ఇదే అనువైన కాలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement