ఉగ్రవాదులను ఉరి తీయాలి
● మతసామరస్యాన్ని కాపాడాలి
● పర్యాటకులపై ఉగ్ర దాడికి ముస్లిం మహిళా జేఏసీ ఖండన
● కొవ్వొత్తులతో ర్యాలీ
సాక్షి, రాజమహేంద్రవరం: జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గాం వద్ద పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని నిరసిస్తూ ముస్లిం ఐక్య వేదిక రాజమహేంద్రవరం శాఖ (జేఏసీ) ఆధ్వర్యాన మహిళలు శుక్రవారం రాత్రి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక జాంపేటలోని ఆజాద్ చౌక్ వద్ద ముస్లిం జేఏసీ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ ఎండీ హబీబుల్లా ఖాన్ నాయకత్వంలో ముస్లిం మహిళలు కొవ్వొత్తులతో ఈ ర్యాలీ నిర్వహించారు. ‘ఉగ్రవాదాన్ని అరికట్టాలి, నిందితులను కఠినంగా శిక్షించాలి, హిందూ ముస్లిం భాయీభాయ్, మేరా భారత్ మహాన్’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మహిళలు మాట్లాడుతూ, ఉగ్రవాదుల చేతిలో అసువులు బాసిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరారు. అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు హతమార్చారని, ప్రతి పౌరుడూ ఈ దాడిని ఖండించాలని అన్నారు. దేశంలోని ఉగ్రవాదులను అణచివేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, తక్షణమే ఉగ్రవాద నిర్మూలనకు కేంద్రం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 370 ఆర్టికల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ రద్దు చేసి కశ్మీర్‌ను అల్లకల్లోలం చేశారని అన్నారు. కశ్మీర్ ఉగ్రవా దాడికి కేంద్రం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ ముస్లింలు ఐక్యంగా జీవించే లౌకిక దేశం భారత్ అని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు మతాల మధ్య చిచ్చు రేపి, దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఉగ్రవాదాన్ని ముస్లింలు ప్రేరేపిస్తున్నారంటూ బీజేపీ ఆరోపిస్తోందని, కానీ, పర్యాటకులకు అండగా మహమ్మద్ హుస్సేన్ అనే గుర్రపు స్వారీ చేసే వ్యక్తి ఉగ్రవాదులను అడ్డుకొని, అనేక మంది ప్రాణాలు కాపాడి, దేశం కోసం ప్రాణాలర్పించి, దేశ సమగ్రతను చాటి చెప్పాడని గుర్తు చేశారు. ఈ ర్యాలీలో ముస్లిం మహిళా నాయకులు ఆయేషా, షాపు, హీర, షాహిన, ముంతాజ్, ఫర్హిద్, షబ్నం తదితరులు పాల్గొన్నారు.


