పారిశ్రామిక పార్కులో సైట్ బుకింగులు ప్రారంభం
రాజానగరం: కలవచర్లలో 104 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు సైట్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని ఔత్సాహికులకు కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. సంబంధిత అధికారులతో కలసి శుక్రవారం ఆ ప్రాంతాన్ని సందర్శించిన ఆమె పరిశ్రమల ఏర్పాటుకు అక్కడ జరుగుతున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఇక్కడ 390 సైట్స్ బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. రిజర్వేషన్లను అనుసరించి సైట్స్ కేటాయిస్తారని తెలిపారు. ఇప్పటికే వేమగిరి, జేగురుపాడుకు చెందిన 197 మందికి అనుమతులు ఇచ్చామని సంబంధిత అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. కార్యక్రమంలో జోనల్ మేనేజర్ రమణారెడ్డి, పరిశ్రమల అధికారి శ్రీవనిధర్ రామన్, విద్యుత్ శాఖ అధికారి కె.తిలక్‌కుమార్, ఏడీ ప్రదీప్‌కుమార్, తహసీల్దార్ జీఏఎల్‌ఎస్ దేవి తదితరులు పాల్గొన్నారు.


