కల్యాణము చేతము రారండీ.. | - | Sakshi
Sakshi News home page

కల్యాణము చేతము రారండీ..

Apr 23 2025 7:50 AM | Updated on Apr 23 2025 7:50 AM

కల్యాణము చేతము రారండీ..

కల్యాణము చేతము రారండీ..

సత్యదేవుని కల్యాణోత్సవాలకు సన్నాహాలు

నేడు దేవస్థానం, ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం

పలు అంశాలపై చర్చ

అన్నవరం: సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల దిశగా అధికారులు ఎట్టకేలకు అడుగులు వేస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై దేవస్థానం, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో రత్నగిరిపై బుధవారం సమన్వయ సమావేశం నిర్వహిస్తున్నారు. కల్యాణోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే అంశాలపై ఈ సందర్భంగా సమీక్షించనున్నారు. పెద్దాపురం ఆర్‌డీఓ రమణి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ వీర్ల సుబ్బారావు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొంటారు. ఉత్సవాలకు దేవస్థానం తరఫున చేపట్టే ఏర్పాట్లను ఈఓ ఈ సమావేశంలో వివరించనున్నారు.

వీటిపై దృష్టి పెడితే మేలు

ఫ వచ్చే నెల 7 నుంచి 13వ తేదీ వరకూ కల్యాణోత్సవాలు జరగనున్నాయి. 8వ తేదీ రాత్రి 9.30 గంటలకు సత్యదేవుని దివ్యకల్యాణం నిర్వహిస్తారు. దీనికి 10 వేల మందికి పైగా భక్తులు హాజరయ్యే అవకాశముంది. అయితే, స్వామివారి వార్షిక కల్యాణ వేదిక ముందున్న విశ్రాంతి షెడ్డులో సుమారు 2 వేల మంది మాత్రమే తిలకించే అవకాశం ఉంది. ఆ షెడ్డుకు ఇరువైపులా ఉన్న ఆవరణలో స్వామివారి కల్యాణాన్ని తిలకించేలా పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తే మిగిలిన భక్తులకు సౌకర్యంగా ఉంటుంది.

ఫ భక్తులకు మంచినీరు, కల్యాణానంతరం అన్నదాన పథకంలో ఉచిత ఫలహారం రెండుమూడు చోట్ల పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఫలహారం ప్యాకెట్లు రూపంలో పంపిణీ చేస్తే భక్తులు వాటిని తీసుకుని వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.

ఫ కల్యాణానంతరం ఉచిత ప్రసాదం, తలంబ్రాలు ఒకేచోట మాత్రమే పంపిణీ చేస్తూండటంతో ఏటా భక్తుల తోపులాట జరుగుతోంది. అలా కాకుండా స్వామివారి సర్క్యులర్‌ మండపంతో పాటు మరో రెండుచోట్ల పంపిణీ చేయడం మేలు.

ఫ భక్తులు భారీగా వచ్చే అవకాశమున్నందున వారిని నియంత్రించేందుకు సుమారు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయాలి.

ఫ సత్యదేవుని దివ్యకల్యాణం జరిగే మే 8న ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించాలి. చిన్న, ద్విచక్ర వాహనాలు మినహా మిగిలిన వాటిని సాధ్యమైనంత వరకూ కొండ దిగువనే నిలిపివేయాలి. భక్తులను కొండ మీదకు తరలించేందుకు సుమారు 20 బస్సులు వినియోగించాల్సిన అవసరం ఉంటుంది.

ఫ పశ్చిమ, తూర్పు రాజగోపురాల పరిసరాల్లోని పార్కింగ్‌ స్థలాల వద్ద భక్తుల సౌకర్యార్థం ఎక్కువ సంఖ్యలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. సుమారు వంద మంది అదనపు సిబ్బందితో పారిశుధ్య చర్యలు చేపట్టాలి.

ఫ కల్యాణోత్సవాలు జరిగే ఏడు రోజులూ దేవస్థానానికి నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలి.

ఫ ముందు జాగ్రత్తగా అగ్నిమాపక శకటంతో సిబ్బంది కల్యాణం రోజున రత్నగిరిపై ఉండాలి.

ఫ ఉత్సవాల చివరి రోజైన మే 13న సత్యదేవుని శ్రీపుష్పయాగం స్వామివారి నిత్య కల్యాణ మండపంలో నిర్వహిస్తారు. ఆ కార్యక్రమం అనంతరం మహిళలకు రవికెల వస్త్రాలు పంపిణీ చేస్తున్న సమయంలో ఏటా గందరగోళం ఏర్పడుతోంది. దీని నివారణకు పక్కా చర్యలు చేపట్టాలి.

ఫ ఇతర పెద్ద దేవస్థానాల్లో జరిగే ఉత్సవాల మాదిరిగానే సత్యదేవుని కల్యాణోత్సవాలకు కూడా చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్‌ను నియమిస్తే మేలు.

మద్యం దుకాణాలు బంద్‌ చేయాలి

గతంలో అన్నవరం మెయిన్‌ రోడ్డులో పాత బస్టాండ్‌ సమీపాన ఒకే ఒక్క మద్యం దుకాణం ఉండేది. ఈ ఏడాది బస్‌ కాంప్లెక్స్‌ వెళ్లే దారిలో మరో మద్యం దుకాణం కూడా ఏర్పాటు చేశారు. ఈ దుకాణాల ముందు నుంచే రథోత్సవం జరుగుతుంది. అందువలన కల్యాణోత్సవాలు జరిగే ఏడు రోజులూ అన్నవరంలో పంపా సత్రం వద్ద ఉన్న మద్యం దుకాణాలను 48 గంటల ముందు నుంచే బంద్‌ చేయించేందుకు చర్యలు తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement