
కుమారారామ భీమేశ్వరస్వామికి తొలి అభిషేకం చేస్తున్న అర్చకులు
పంచారామ క్షేత్రం కిటకిట
సామర్లకోట: కార్తిక మాసం చివరి ఆదివారం కావడంతో పంచారామ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. కుమారారామ భీమే శ్వరస్వామి, బాలాత్రిపురసుందరీదేవి అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచీ బారులు తీరారు. ధ్వజస్తంభం, రావి, జమ్మి, మారేడు చెట్లు, తులసి మొక్కల వద్ద కార్తిక దీపాలు వెలిగించారు. ఈఓ టీవీ సూర్యనారాయణ ఆధ్వర్యాన వేకువన గోపూజతో స్వామివారికి అభిషేకాలు, పూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి, భక్తులకు దర్శనాలు కల్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఆలయ అర్చకులు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానానికి రూ.2,500 చెల్లించిన భక్తులు లక్షపత్రి పూజలు చేసుకున్నారు. మధ్యాహ్నం దేవస్థానం తరఫున భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. గత నెల 14న ప్రారంభమైన కార్తిక మాసోత్సవాలు ఈ నెల 13తో ముగియనున్నాయి. ఈ సందర్భంగా దీపారాధన సంఘ సభ్యుల ఆధ్వర్యాన 12వ తేదీ మధ్యాహ్నం భారీగా అన్నదానం చేయనున్నారు. రాత్రి కోటి దీపోత్సవం నిర్వహిస్తారు. 13వ తేదీ మధ్యాహ్నం స్వామి వారికి వెండి ఆభరణాలతో జటాజూటం అలంకరణతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ అలంకరణను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.