సాయి తత్వాన్ని అందరూ తెలుసుకోవాలి
తాళ్లపూడి: సాయి అంటే ఒక కులానికి, ఒక మతానికి చెందిన వారు కాదని, సమస్త జీవులందరిలో ఉన్నారని, ఆ మహనీయుడు పంచిన ప్రేమ, శాంతి, క్షమ గుణాలను అందరూ ఆచరించి సాయి తత్వం తెలుసుకోవాలని పలువురు వక్తలు అన్నారు. మండలంలోని బల్లిపాడు కాకర్ల రామయ్య ఫంక్షన్ హాలులో హైదరాబాద్‌కు చెందిన శ్రీ షిర్డీ సాయి సేవాదళ్ ఆధ్వర్యాన శుక్రవారం అఖిల భారత శ్రీ షిర్డీ సాయి భక్త సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. తొలుత తాళ్లపూడిలోని సాయిబాబా ఆలయం వద్ద పూజలు, అభిషేకాలు నిర్వహించి, బల్లిపాడు వరకూ పల్లకీతో బాబా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం జరిగిన సమ్మేళనంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాయి భక్తులు ఎం.మహీధర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యరెడ్డి, మైనంపాటి ప్రసాద్, పిప్పళ్ల ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. బాబా సంకీర్తనలు, భజనలు, లీలలు, వేదాంత రహస్యాలు, బాబా ప్రవచనాలు, అవతార విశిష్టత, మధ్యాహ్న హారతి, ఉపనిషత్తుల సారం, సాయి తత్త్వం వంటి అంశాల గురించి వివరించారు. సంస్థ చైర్మన్ సింహాద్రి జనార్దనరావు, ఫౌండర్ కాళ్ల రత్నాజీరావు ఆధ్వర్యాన తాళ్లపూడి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులను సత్కరించారు. కార్యక్రమంలో అప్పన రాజా, గోకవరపు సూరిబాబు, మండల రైస్ మిల్లర్ల సంఘం సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సాయి తత్వాన్ని అందరూ తెలుసుకోవాలి


