క్రీస్తు మార్గం అనుసరణీయం
రాజమహేంద్రవరం రూరల్: మానవాళికి ఏసుక్రీస్తు మార్గం అనుసరణీయమని వక్తలు పునరుద్ఘాటించారు. వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షుడు రెవరెండ్ విజయ సారథి నేతృత్వంలో కొంతమూరు క్రీస్తు నిరీక్షణాలయ ప్రాంగణంలో మెగా క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, పార్టీ కొవ్వూరు ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, కోనసీమ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు ప్రసంగించారు. ‘తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును’ అనే క్రీస్తు బోధన అక్షర సత్యమని మాజీ ఎంపీ ఉండవల్లి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇదే విషయాన్ని తనకు చెప్పేవారని, ఆయన చెప్పిన మాటలు నేటికీ పాటిస్తున్నానని వెల్లడించారు. కరుణ, దయతో ఏసుక్రీస్తు లోకానికి కొత్త మార్గాన్ని చూపారని, ఆ మార్గం ఆచరణనీయమని వేణు అన్నారు. క్రీస్తు జననం శాంతికి సంకేతమని, తన జీవితం, మరణం ద్వారా లోకానికి సరైన మార్గాన్ని ఏసుప్రభువు చూపారని భరత్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియన్ సంస్థలు సేవా తత్పరతతో సాగుతున్నాయని, ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వీడాలని జాన్‌వెస్లీ అన్నారు. క్రిస్టియన్ మైనారిటీ శాఖ రూపకల్పనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నాంది పలికారని, ఆయన చొరవతోనే క్రైస్తవులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తలారి వెల్లడించారు. సేవకులు, విశ్వాసులతో కలిసి కేక్ కట్ చేసి, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వక్తలు, ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు.


