చంద్రబాబుది ట్రబులింజిన్ సర్కార్
● 18 నెలల్లో ఎంత సంపద సృష్టించారు?
● వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు
రాజమహేంద్రవరం రూరల్: చంద్రబాబు ప్రభుత్వం డబుల్ ఇంజిన్ కాదని.. కేవలం ట్రబులింజిన్ సర్కార్ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం 18 నెలల పాలనలో సృష్టించిన సంపద ఎంతో ప్రజలకు చెప్పాలన్నారు. ఇప్పుడు తెస్తున్న లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏ సంక్షేమ పథకానికి ఖర్చు చేస్తున్నారో తెలపాలని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను అధికారుల పైకి నెట్టడం సబబు కాదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా మీరు నిధులు, ప్రణాళికలు ఇస్తే అధికారులు వాటిని అమలు చేస్తారన్నారు. వైఫల్యాలన్నీ అధికారుల పైకి నెట్టేసి, తప్పించుకునే ప్రయత్నం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ‘జగన్ అప్పులు చేసి సంక్షేమం పంచుతున్నారు.. నేను సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తాన’ంటూ చంద్రబాబు చెప్పుకున్నారని వేణు గుర్తు చేశారు. గత 8 నెలల్లో రాష్ట్ర ఆదాయ లోటు 163 శాతం వచ్చిందన్నారు. దీనినిబట్టి చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టేనని చెప్పారు. సంపద సృష్టి అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి నిధులు తేవడంలో విఫలమయ్యారని, అప్పులు చేయడమే ఆదాయం పెంచడమనుకోవాలా అనేది చంద్రబాబే చెప్పాలని అన్నారు. ఆరోగ్యశ్రీకి బిల్లులు చెల్లించడం లేదని, మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని.. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతి విషయంలోనూ చంద్రబాబు వైఫల్యం కనిపిస్తోందని చెప్పారు. వైఎస్ జగన్‌పై చంద్రబాబు అండ్ కో వేసిన నిందలన్నీ అబద్ధాలనే విషయం ప్రజలకు అర్థమవుతోందన్నారు. ప్రతి అంశంలోనూ కుట్ర రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్‌గా మారారన్నారు. నష్టపోయింది ప్రజలు, నష్టపరిచింది టీడీపీ అనే విషయం ప్రజలకు అర్థమైందని, కేంద్రంతో కలసి ఉండి, ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.
ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలే తప్ప.. వారి కష్టాలు తీర్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. వైఎస్ జగన్‌పై నింద వేస్తే పేదల ఆరోగ్యం బాగు పడుతుందా.. విద్య అందుతుందా.. రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందా.. యూరియా సరఫరా జరుగుతుందా అని వేణు ప్రశ్నించారు. యూరియా కోసం రైతులు బారులు తీరడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయినట్లు కాగ్ లెక్కలు చెబుతున్నాయన్నారు.. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పక్కన పెట్టేసి, ప్రజలను ఏమార్చాలనే ఏకై క లక్ష్యంతోనే చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోందని వేణు దుయ్యబట్టారు.


