
అగ్నికి ఆహుతవుతున్న తాటాకిళ్లు
కొత్తపల్లి: నాగులాపల్లి శివారు ఉప్పరగూడెంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరు తాటాకిళ్లు దగ్ధమై, రూ.14 లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. ఈ ఇళ్లల్లో గంధం వెంకట రమణ, గంధం చెల్లారావు, గుర్రాల శాంతమ్మ, కుమిలి ముసలయ్య, కుమిలి సారయ్య, కుమిలి దుర్గమ్మ, పాకలపాటి శ్రీను కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆ ఇళ్లపై ఉన్న విద్యుత్ తీగలపై మంగళవారం కొబ్బరి ఆకు పడటంతో నిప్పురవ్వలు రేగి, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నికి వేగంగా వీస్తున్న గాలి తోడవడంతో చూస్తూండగానే మంటలు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వ్యాపించాయి. ఆ వేడికి ఆ ఇళ్లల్లో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో మంటలు మరింత చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పిఠాపురం అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇల్లు, వాటిల్లోని వస్తువులు, నగదు అగ్నికి ఆహుతైపోయాయి. ఇళ్లు నిర్మించుకునేందుకు ముసలయ్య రూ.2 లక్షలు, సారయ్య రూ.1.5 లక్షలు, వెంకట రమణ రూ.3.10 లక్షలు, గుర్రాల శాంతమ్మ రూ.లక్ష చొప్పున దాచుకున్నారు. ఆ నగదంతా కాలి బూడిదైపోవడంతో బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. గృహోపకరణాలకు సుమారు రూ.7 లక్షల వరకూ నష్టం వాటిల్లినట్టు అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ ప్రసాద్ పరిశీలించారు. బాధితులను నాగులాపల్లి ఉప సర్పంచ్ గుర్రాల చిరంజీవి కుమార్ పరామర్శించారు. ప్రమాద విషయాన్ని ఎమ్మెల్యే పెండెం దొరబాబు దృష్టికి తీసుకువెళ్లి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.