చిట్ వద్దు, ఫైనాన్స్ వద్దు.. జాగా కొంటే.. అదే ముద్దు | No Chitfund, No finance, Purchase lands as an investment | Sakshi
Sakshi News home page

చిట్ వద్దు, ఫైనాన్స్ వద్దు.. జాగా కొంటే.. అదే ముద్దు

Apr 21 2023 2:18 AM | Updated on Apr 21 2023 1:20 PM

- - Sakshi

సాక్షిప్రతినిధి, కాకినాడ: కోవిడ్‌ తదనంతర పరిణామాలతో ప్రజలు నగదు నిల్వలకు వెనుకంజ వేస్తున్నారు. నగదు నిల్వల కంటే చర, స్థిరాస్తులపై పెట్టుబడికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఏదో ఆరోగ్యం, విద్య వంటి అత్యవసరాలకు తప్పించి నగదు తమ వద్ద ఉంచుకోవాలనే ఆలోచనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సంపన్నుల నుంచి ఎగువ మధ్యతరగతి వర్గాల వరకు ఎవరిని కదిపినా ఇదే మాట చెబుతున్నారు. ఇంతవరకు కొంతమంది నాలుగు లక్షల రూపాయలు కూడబెడితే చాలు రూ.2 వడ్డీకి అప్పు ఇచ్చి నెలనెలా వచ్చే సొమ్ముతో కాలక్షేపం చేసేవారు. కోవిడ్‌ సమయంలో సంభవించిన మరణాలు, అనంతరం పెరుగుతున్న హఠాన్మరణాలతో వడ్డీ మాట దేవుడెరుగు.. కనీసం అసలు కూడా తిరిగి రావడం లేదని వారంతా గగ్గోలు పెడుతున్నారు.

అభద్రతతో ఆందోళన

దీనికితోడు మార్గదర్శి వంటి చిట్‌ఫండ్‌ కంపెనీలు, ప్రైవేటు బ్యాంకులు, కోపరేటివ్‌ బిల్డింగ్‌ సొసైటీలు ప్రజల నుంచి కోట్లు డిపాజిట్లు సేకరించి నిధులు తమ అవసరాలకు మళ్లిస్తున్నాయి. కొన్ని బోర్డు తిప్పేస్తున్నాయి. ఈ పరిణామాలతో డబ్బులు దాచుకున్న వారిలో కూడా అభద్రతాభావం వచ్చేసింది. ఈ పరిస్థితులను బేరీజు వేసుకుని నగదు నిల్వ పెంచుకోవడం కంటే భూములు, ఇళ్ల కొనుగోలు మేలు అని ఎక్కువ మంది భావిస్తున్నారు. స్థిరాస్తులు కూడబెట్టుకుంటే ఏ క్షణాన అవసరం వచ్చినా బ్యాంకుల్లో కుదవ పెట్టుకుని అప్పటికప్పుడు సొమ్ము తెచ్చుకోవచ్చుననే ఒక భరోసా ఇందుకు ప్రధాన కారణం. అప్పులు ఇచ్చి అసలు కోసం పోలీసు స్టేషన్లు, ప్రైవేటు సెటిల్‌మెంట్‌ల కోసం తిరగడం కంటే భూములు, ప్లాట్లు, ఇళ్లు కొనుక్కుని పక్కాగా రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోవచ్చునని భావిస్తున్నారు.

రెండు మూడేళ్లకే రేట్ల పెరుగుదల

నాలుగు డబ్బులు వెనకేసుకునేవారి ఆలోచనలు మారడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భూములు, ప్లాట్లు క్రయ, విక్రయాలు పెరుగుతున్నాయి. ఏటా రిజిస్ట్రేషన్లు కూడా రెట్టింపవుతున్నాయి. బడా బాబులు భారీగా భూములు కొనుగోలు చేస్తుంటే, ఎగువ ..దిగువ మధ్య తరగతి వర్గాలు కుటుంబ పోషణ పోగా మిగుల్చుకున్న కొద్దిపాటి సొమ్ముతో 100, 150 గజాలు కొనుగోలు చేస్తున్నారు. గజం రూ.15వేలు పెట్టి కొనుగోలు చేసిన స్థలాల రేట్లు రెండు, మూడేళ్లకే పెరిగిపోతున్నాయి. దీంతో ఇది లాభార్జనగా ఉంటుందని మధ్యతరగతి వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి. ఇలా కొనుగోలు చేసిన స్థలాలు భవిష్యత్తులో పిల్లల చదువులు, వివాహాలకు కలసి వస్తాయని వారు చెబుతున్నారు. సరళతరంగా బ్యాంకుల్లో వస్తున్న రుణాలు తీసుకుని మరీ స్థలాలు కొనుగోలు చేస్తున్న వారూ లేకపోలేదు. బడాబాబులు, కాంట్రాక్టర్లు, అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చిన వారు సైతం రికవరీ చేసి స్థలాలపై పెట్టుబడి పెడుతున్నారు.

జిల్లాల పునర్విభజన తర్వాత..

కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతో పాటు అమలాపురం సహా రామచంద్రపురం, మండపేట, తుని, సామర్లకోట వంటి పట్టణాల పరిసర ప్రాంతాల్లో స్థలాలు, ప్లాట్ల క్రయ, విక్రయాలు ఇటీవల రెట్టింపయ్యాయి. హాట్‌కేక్‌లుగా అమ్ముడు పోయే ప్రాంతాల్లో స్థలాలు, ప్లాట్లకు గిరాకీ ఎక్కువగా ఉంటోంది. పూర్వపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగర పరిసర ప్రాంతాల్లో స్థలాలు, భూములు, ఇళ్లు కొనుగోలుకు నాడు జిల్లా నలుమూలల నుంచి ఎక్కువ ఆసక్తి కనబరిచేవారు. పునర్విభజన తరువాత కాకినాడతో పాటు అమలాపురం, రాజమహేంద్రవరం జిల్లా కేంద్రాలయ్యాయి. ఇప్పుడు వాటిని ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల భూములు రియల్‌ ఎస్టేట్లుగా ఎక్కువ రూపాంతరం చెందుతున్నాయి. అపార్టుమెంట్‌ సంస్కృతి పెరగడంతో స్థలాల విలువ రెట్టింపు అయింది.

పెరుగుతున్న రియల్‌ ఎస్టేట్లు

కోనసీమ కేంద్రం అమలాపురానికి ఆనుకుని ఎర్రవంతెన, కామనగరువు, ఈదరపల్లి, పేరూరు, భట్నవిల్లి, బండార్లంక, రాజమహేంద్రవరంలో గోదావరి గట్టు నుంచి తొర్రేడు, మధురపూడి విమానాశ్రయం రోడ్డు నుంచి గాడాల, లాలాచెరువు నుంచి దివాన్‌చెరువు, జాతీయ రహదారి నుంచి శ్రీరామపురం రోడ్డు, రాజవోలు, సంపత్‌నగర్‌ వరకు నివాసప్రాంతాలుగా విస్తరిస్తున్నాయి. కాకినాడకు ఆనుకుని మేడలైన్‌, చీడిగ, కొవ్వాడ, తూరంగి, పెనుగుదురు, సర్పవరం, గైగోలుపాడు, ఏపీఎస్పీ, అచ్చంపేట వాకలపూడి వరకు రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ పెరిగింది. ఫలితంగా రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. జిల్లాల విభజన జరుగుతుందనే ముందుచూపుతో గడచిన రెండేళ్లుగా జిల్లా కేంద్రాలకు ఆనుకుని ఐదారు కిలోమీటర్ల వరకు భూములు, స్థలాలు రిజిస్ట్రేషన్లు కూడా పెరిగాయి. పట్టణానికి సమీపాన నాలుగైదు కిలోమీటర్ల వరకు ఖాళీగా ఉన్న పంట భూములు రియల్‌ ఎస్టేట్‌లుగా మారి నివాసప్రాంతాలు అవుతున్నాయి. గడచిన నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్‌లు, డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్‌ల ఆదాయ గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రిజిస్ట్రేషన్‌, ఆదాయం వివరాలు

సంవత్సరం దస్తావేజులు ఆదాయం

2018–19 1,48,213 541.74 కోట్లు

2019–20 1,91,191 592. 07 కోట్లు

2020–21 1,67,095 638.21 కోట్లు

2021–22 2,44,695 907.16 కోట్లు

2022–23 2,66,233 886.88 కోట్లు

భవిష్యత్తుకు భరోసాగా భూములపై పెట్టుబడి

భూములు, స్థలాలు, ఫ్లాట్లపై పెట్టుబడి పెట్టడమంటే అన్ని వర్గాల ప్రజలు భరోసాగా భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో రిజిస్ట్రేషన్లు పుంజుకున్నాయి. ఆదాయం కూడా బాగా పెరుగుతూ వస్తోంది. కోవిడ్‌ తరువాత పరిణామాలతో ప్రజల ఆలోచనా విధానం మారింది. భూములపై పెట్టుబడి పెడితే భవిష్యత్తులో వాటి విలువ పెరుగుదలే తప్ప తరుగుదల ఉండదనే నమ్మకం ఏర్పడింది. దీంతో స్థిరాస్థులపైనే ఎక్కువగా డబ్బు పెడుతున్నారు.
– ఎ.నాగలక్ష్మి, డీఐజీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, కాకినాడ.

కొనుగోలు భద్రతనిస్తోంది

భూమి కొనుగోలు కుటుంబానికి భద్రతనిస్తుంది. గతంలో బ్యాంకులో భద్రపరుచుకోవడం, లేకపోతే వడ్డీలకు ఇవ్వడం చేసేవారు. కొన్ని సొసైటీలు రాత్రికి రాత్రే ఎత్తివేయడం, వడ్డీకి తీసుకునేవారు తిరిగి ఇచ్చే విషయంలో ఏర్పడే సమస్యలతో విసుగెత్తిపోయారు. దీంతో రోజురోజుకూ పెరుగుతున్న భూమి రేట్లను దృష్టిలో పెట్టుకుని భూములు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.
– జాడ అప్పలరాజు,

దస్తావేజు లేఖరి, కాకినాడ

విలువ పెరుగుతుందనే కొన్నాను

రెక్కల కష్టం మీద కుటుంబం నెట్టుకొస్తున్నాను. కూడబెట్టిన కొద్దిపాటి సొమ్మును భూమిపై పెట్టడం మంచిదనుకున్నాను. మున్ముందు ఆ భూమి విలువ పెరుగుతుందని 100 గజాల స్థలాన్ని కొన్నాను. ఎక్కడైనా బ్యాంకులో వేద్దామన్నా నమ్మకం కుదరడం లేదు. ఇవన్నీ ఆలోచించే పెట్టిన సొమ్ముకు భరోసాతోపాటు, ధరలు కూడా పెరుగుతాయని జాగా కొనుక్కున్నాను.

– డి.రమేష్‌, ఇంద్రపాలెం, కాకినాడ

క్రయవిక్రయదారులతో కిటకిటలాడుతున్న కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం1
1/4

క్రయవిక్రయదారులతో కిటకిటలాడుతున్న కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement