అమలాపురం టౌన్: తెలుగు సామాజిక, సాహిత్య రంగాలకు నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు అందించిన సేవలు అజరామరమని ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. తన కార్యాలయంలో సోమవారం జరిగిన గురజాడ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తొలుత గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి వందనం అర్పించారు. ఏఎస్పీ మహేంద్ర మత్తే, ఇతర పోలీస్ అధికారులు కూడా గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) డీఎస్పీ సుబ్బరాజు, స్పెషల్ బ్రాంచి సీఐ వి.పుల్లారావు, ఏఆర్ ఆర్‌ఐ బ్రహ్మానందం, ఎస్పీ కార్యాలయ ఏఏఓ బాలాజీ తదితరులు గురజాడ సేవలను కొనియాడారు.
గురజాడది ప్రత్యేక ముద్ర
అమలాపురం రూరల్: గురజాడ అప్పారావు సాహిత్య సేవలు చిరస్మరణీయమని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) వి.సుబ్బారావు అన్నారు. తెలుగు సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసిన మహాకవి అని అన్నారు. గురజాడ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి డీఆర్‌ఓ, ఇతర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కన్యాశుల్కం నాటకం ద్వారా సమాజంలోని సామాజిక దురాచారాలపై తనదైన శైలిలో గురజాడ ప్రశ్నించారని అన్నారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే సందేశం ద్వారా దేశభక్తి, మానవతా విలువలను ప్రజల్లో పెంపొందించారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా పరిపాలన, విద్య, వైద్య, ఆరోగ్య, పర్యాటక శాఖల అధికారులు కె.నాగలక్ష్మమ్మ, మెహబూబ్ బాషా, ఎం.దుర్గారావుదొర, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
చమురు సంస్థల నిర్లక్ష్యంతోనే
గ్యాస్ పైప్ లైన్ల లీకేజీ
అమలాపురం రూరల్: చమురు సంస్థల నిర్లక్ష్యంతోనే జిల్లాలో గ్యాస్ పైప్‌లైన్ల లీకేజీ వంటి సంఘటనలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. కలెక్టరేట్ వద్ద సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. 1980 నుంచి పలు చమురు సంస్థలు జిల్లాలోని సముద్ర తీర ప్రాంతం నుంచి హైడ్రోకార్బన్ నిల్వలను తరలించుకుపోతున్నా, ఇక్కడి ప్రజలకు న్యాయం చేయడం లేదని విమర్శించారు. సముద్ర తీరంలో జీవరాశులు నాశనమవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని అన్నారు. వశిష్ట ఎస్–1 టెర్మినల్, గాడిమొగ, ధీరూభాయ్ 1, 2, కేజీ–3 బ్లాక్ పరిధిలో పైప్‌లైన్ల లీకేజీల వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ ప్రాంతంలోని సముద్రంలో దొరికే చేపల వల్ల బ్లడ్ క్యాన్సర్ వంటి వ్యాధులు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో 2014లో జరిగిన ప్రమాదం వల్ల అనేక మంది మృతి చెందారని, పాతకాలం నాటి పైప్‌లైన్లే దీనికి కారణమని అన్నారు. పైపులైన్లు మార్చాలంటూ డీఆర్‌ఓ సుబ్బారావుకు ఎమ్మెల్సీ కుడుపూడి వినతిపత్రం అందజేశారు.


