కొత్తపేటలో మోకాళ్లపై నిలుచుని
నిరసన తెలుపుతున్న వీఆర్‌ఏలు
ఐ.పోలవరంలో రైతులకు
వినతిపత్రాలు అందజేస్తున్న వీఆర్‌ఏలు
కొత్తపేట/ఐ.పోలవరం: పే స్కేల్ అమలు, వీఆర్‌ఏలుగా నామినీల నియామకం, అర్హులకు ప్రమోషన్లు, డీఏ, కనీస వేతన చట్టం అమలు తదితర సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్లతో గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) సోమవారం వినూత్న నిరసనలు చేపట్టారు. కొత్తపేటలోని స్థానిక పాత తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆరు రోజులుగా నిర్వహిస్తున్న శిబిరంలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. తమ న్యాయమైన కోర్కెలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీఆర్‌ఏల సంఘం నాయకుడు పిల్లంగోరు బాలు, మండల సంఘం అధ్యక్షుడు కె.భీమశంకరం, కోశాధికారి ఎస్.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఐ.పోలవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వివిధ గ్రామాల ప్రజలు, రైతులు, నాయకులకు వీఆర్‌ఏలు వినతిపత్రాలు అందజేసి, వినూత్నంగా నిరసన తెలిపారు. ఆయా వర్గాల వారికి తమ సమస్యలు వివరించారు. మండల వీఆర్‌ఏల సంఘం ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో గాలి సత్యనారాయణ, వి.గంగాధరరావు, సానబోయిన సత్యనారాయణ, బి.సుదర్శనరావు తదితరులు పాల్గొన్నారు.


