● పీజీఆర్‌ఎస్‌కు పదేపదే విన్నపాలు
● అయినా ఫలితం లేదంటున్న ప్రజలు
● ఈ వారం 245 అర్జీల అందజేత
అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీలు అందిస్తున్నా పరిష్కారానికి మాత్రం నోచడం లేదని ప్రజలు వాపోతున్నారు. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఉపాధి, ఉద్యోగాల కల్పన, ఇళ్లు, ఇళ్ల స్థలాల మంజూరు, భూ సమస్యలు, రీసర్వే, ఆన్‌లైన్‌లో భూ రికార్డుల నమోదు, తాగునీరు, పారిశుధ్యం, మురుగు కాలువల్లో పూడికల తొలగింపు, సదరం సర్టిఫికెట్ల మంజూరు, రోడ్లు, ప్రభుత్వ పథకాల లబ్ధి తదితర సమస్యలపై అర్జీలు సమర్పిస్తున్నారు. ఆ సందర్భంగా అధికారులు ఇస్తున్న హామీలు విని, తమ సమస్య పరిష్కారమైపోతుందని సంబరపడుతూ ఇంటిముఖం పడుతున్నారు. కానీ, రోజులు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉండటంతో అసంతృప్తి చెందుతున్నారు. అర్జీదారుల సమస్యలను క్షేత్ర స్థాయిలో సమగ్రంగా పరిశీలించి, వారు సంతృప్తి చెందేవిధంగా పరిష్కరించాలని కలెక్టర్ పదేపదే ఆదేశిస్తున్నా ప్రయోజనం ఉండటం లేదని అంటున్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో సమగ్రంగా పరిశీలించకుండానే సమస్య పరిష్కరించినట్లు చెబుతున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లో భూ సమస్యలపై ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. రీ సర్వేలో తమ భూమి తక్కువగా ఉందని ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు అర్జీదారులు ఆరోపిస్తున్నారు. ఈ వారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు ప్రజలు 245 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి, డీఆర్‌ఓ సుబ్బారావు, ఆర్‌డీఓ సరళాదేవి, డీఆర్‌డీఏ పీడీ రాంబాబు, పీజీఆర్‌ఎస్ ఎస్‌డీసీ డి.అచ్యుత కుమారి తదితరులు అర్జీలు స్వీకరించారు. వీటిని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 30 అర్జీలు
అమలాపురం టౌన్: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి 30 మంది వివిధ సమస్యలపై ఫిర్యాదులు చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన అర్జీదారుల నుంచి ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ మహేంద్ర మత్తే తమ తమ చాంబర్లలో ఫిర్యాదులు స్వీకరించారు. ఎక్కువగా ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులే వచ్చాయి. దీంతో, ఆ అర్జీదారులకు ఎస్పీ, ఏఎస్పీలు కౌన్సెలింగ్ చేసి, సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నించారు. పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను ఎస్పీ మీనా ఆదేశించారు.


