● రావులపాలెంలో నిర్వహణ
● ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి వెల్లడి
కొత్తపేట: వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం మంగళవారం ఉదయం 10 గంటలకు రావులపాలెం సీఆర్‌సీలో నిర్వహిస్తున్నారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఈ విషయం తెలిపారు. సీఆర్‌సీలో సమావేశం ఏర్పాట్లను సోమవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు.. వెన్నుపోటు పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై ఈ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా, రాజ్యసభ మాజీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, పార్టీ ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, పీఏసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, గొల్లపల్లి సూర్యారావు, నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటారని వివరించారు. జిల్లాలోని పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని జగ్గిరెడ్డి పిలుపునిచ్చారు.


