బ్రెయిన్ కాన్సర్‌తో బాధ పడుతున్న నాకు 8 నెలల క్రితం ఆపరేషన్ చేయించారు. అప్పటి నుంచీ కాలు, చెయ్యి పని చేయడం లేదు. మాట పడిపోయింది. మంచంపై ఉన్నాను. నాకు ఏవిధమైన ఆదాయ వనరులూ లేవు. నా భర్త కూలి పైనే కుటుంబం ఆధారపడి ఉంది. దుర్భర పరిస్థితుల్లో ఉన్న నాకు క్యాన్సర్ పేషెంట్లకు ఇచ్చే మెడికల్ పెన్షన్ మంజూరు చేయాలి.
– యార్లగడ్డ భాగ్యవతి, చింతలూరు, ఆలమూరు మండలం
ప్రభుత్వ మరుగుదొడ్లతో ఇబ్బంది
కత్తిమండలో నా భూమి పక్కన సుమారు 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వ మరుగుదొడ్లు నిర్మించారు. ప్రస్తుతం అవి శిథిలావస్థలో, నిరుపయోగంగా ఉన్నాయి. ప్రస్తుతం నేను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. కుటుంబ అవసరాలు, అప్పులు తీర్చుకునేందుకు నా భూమిని అమ్ముకుందామనుకుంటున్నాను. కానీ, మరుగుదొడ్డి వల్ల నా భూమిని కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మరుగుదొడ్లను తొలగించాలని గతంలో పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశాను. పంచాయతీ తీర్మానం చేయాలని చెప్పి తొలగించలేదు. ఆ మరుగుదొడ్ల వల్ల పరిసర ప్రాంతంలో తీవ్ర దుర్గంధం, అసౌకర్యకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై కలెక్టరేట్‌లో అధికారులకు ఫిర్యాదు చేశాను. – గంటా రవికుమార్, మోరిపోడు, సఖినేటిపల్లి మండలం


